Published : 16/12/2020 16:29 IST

ఒకే టీకాపై ఆధారపడొద్దు

కొవిడ్‌ ఇప్పట్లో తగ్గేది కాదు 

మొదలైన డైరెక్ట్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 

‘ఈనాడు’తో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ నివారణకు ఒకే టీకాపై ఆధారపడకూడదని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా టీకా (వ్యాక్సిన్ల)ల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయని.. ఏ ఒక్క టీకాతోనూ దీర్ఘకాలిక రక్షణ ఉంటుందనే సమాచారం లేదన్నారు. కరోనా టీకాపై జరుగుతున్న పరిశోధనలు.. టీకా సమర్థత తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. 

ఇప్పటివరకు ఏ టీకాకు అనుమతులు రాలేదు.. అత్యవసరం కింద రెండు మూడు నెలల్లో ఇచ్చినా సామాన్యులకు చేరేందుకు మనలాంటి దేశంలో చాలా సమయం పడుతుంది. టీకాను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల వద్ద భద్రపర్చడం, రవాణా వంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాక్సిన్‌ రావడం సంతోషమే అయినా వాటి పనితీరు ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. రోగనిరోధక శక్తిని బట్టి ఆరునెలలా, సంవత్సరమా, అంతకుమించి ఉంటుందా అనేది ఇప్పుడే తెలియదు. ఏడాది వరకు ఉంటుందనుకున్నా ప్రతి ఏటా జనాలు టీకాలు వేసుకోలేరు. టీకా వస్తుందని జాగ్రత్తలు విస్మరించడం సరికాదు. సామూహిక రోగనిరోధక శక్తి(హెర్డ్‌ ఇమ్యూనిటీ) వచ్చేవరకు రక్షణ చర్యలు తప్పనిసరి. ఇప్పట్లో ఇది తగ్గేది కాదు. ఒకటి రెండేళ్లపాటు అప్రమత్తత అవసరం. కొవిడ్‌ వైరస్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పరివర్తనాలు(మ్యూటేషన్లు) వస్తున్నాయి. ఇటీవల ఉత్పరివర్తనాల్ని గుర్తించాం.. ‘సూపర్‌ స్ప్రెడర్‌’ వంటి అనూహ్యమైనవేవి లేవు.

పరీక్షలు తగ్గి కేసులు తగ్గాయి

పాజిటివ్‌ కేసులు తగ్గడానికి కొవిడ్‌ పరీక్షలు తగ్గడమే కారణమని డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు. పాజిటివ్‌ రేటు పెద్దగా తగ్గలేదన్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకోవాలని, యాంటిజెన్‌ కంటే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మేలని సూచించారు. 

ఇది సురక్షిత విధానం

భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతించిన సీసీఎంబీ డైరెక్ట్‌ ఆర్టీపీసీఆర్‌(డ్రైస్వాబ్‌) విధానంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని రాకేశ్‌ మిశ్ర తెలిపారు. ఇందుకోసం స్పైస్‌హెల్త్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ సంస్థ ఇప్పటికే దిల్లీలో ఒక్కో పరీక్షకు రూ.499ల చొప్పున మొబైల్‌ ప్రయోగశాల ద్వారా రోజుకు 10 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. డెరెక్ట్‌ ఆర్టీపీసీఆర్‌ పరికరాల తయారీకి అపోలో ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. వీటి ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పరీక్షలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. వైరస్‌ లీక్‌ అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి వైద్య సిబ్బందికి ఈ విధానం ఎంతో సురక్షితమని పేర్కొన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని