జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ రావొచ్చు: జగన్‌

కరోనాతో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ ప్రజలకు సూచించారు. జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

Updated : 29 Sep 2020 22:17 IST

104కి ఫోన్‌ చేస్తే అరగంటలో బెడ్ వివరాలు చెప్పాలి
వచ్చేనెలాఖరున ‘జగనన్న తోడు’ 
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష

అమరావతి: కరోనాతో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌ ప్రజలకు సూచించారు. జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. స్పందన కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడం పాటు పాటు వివిధ అంశాలపై వారికి సీఎం పలు సూచనలు చేశారు.  104కి ఫోన్‌ చేస్తే కరోనా పరీక్షలు, ఆస్పత్రుల వివరాలు అందాలని.. ఆ నంబర్‌కు మాక్‌ కాల్స్‌ చేసి పనిచేస్తోందా? లేదా? అనే విషయాన్ని అధికారులు తనిఖీ చేయాలని చెప్పారు. 104కి ఫోన్‌ చేయగానే బెడ్‌ అందుబాటులో ఉందో లేదో అరగంటలో చెప్పాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనని వివరించారు. కొవిడ్‌ ఆస్పత్రుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో హెల్ప్‌ డెస్క్‌ ఉండాలని సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందకపోతే జిల్లా కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాలని సీఎం స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితులను త్వరగా గుర్తిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందని జగన్‌ చెప్పారు. 

నవంబర్‌ 2న పాఠశాలల పునఃప్రారంభం

గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు విధిగా తనిఖీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అధికారుల పనితీరు పర్యవేక్షణపైనా యాప్‌ సిద్ధంగా ఉందన్నారు. అక్టోబర్‌ 2న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని.. అక్టోబర్‌ 5న విద్యాకానుక కింద విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తామని సీఎం వివరించారు. అక్టోబర్‌ 5నే పాఠశాలలు తెరవాలని నిర్ణయించినప్పటికీ కరోనా పరిస్థితుల దృష్ట్యా పునఃప్రారంభాన్ని నవంబర్‌ 2కి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చేనెలాఖరున జగనన్న తోడు పేరుతో చిరువ్యాపారులకు రుణాలిచ్చే కార్యక్రమం తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ- సన్నద్ధత, రబీ పంటల సాగు ప్రణాళికతో పాటు వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై అధికారులతో సీఎం చర్చించారు. ఖరీఫ్‌ పంట చేతికొస్తున్నందున అక్టోబర్‌ 15 నుంచి కలెక్టర్లు, జేసీలు దీనిపై దృష్టిసారించాలని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలపై అక్టోబర్‌ 1న వివరాలు వెల్లడిస్తామని.. అక్టోబర్‌ 5 నాటికి ఆర్బీకేల్లో గిట్టుబాటు ధరల వివరాలు ఉంచాలన్నారు. ప్రతి పంటకు ఈ క్రాపింగ్‌ పూర్తి చేయాలని.. ఆతర్వాత రైతుల రిజిస్ట్రేషన్‌ జరగాలని సీఎం ఆదేశించారు. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ధాన్యం సేకరిస్తామని రైతులకు చెప్పాలని స్పష్టం చేశారు. జేసీలు వెంటనే రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం చూపాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం

అనంతరం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తి నష్టంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరదలు, పంట నష్టం ప్రభావంపై కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పంట నష్టం, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపాలని సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆర్‌బీకే స్థాయిలో రైతుల ఎన్యుమరేషన్‌ ప్రదర్శించాలని సూచించారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది మృతిచెందినట్లు సమాచారం ఉందని.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం చెల్లించాలని సీఎం ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని