
నగరంలో కొనసాగుతున్న కేంద్రబృందం పర్యటన
హైదరాబాద్: నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వంలోని కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం రఘురామ్, కేంద్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.కె కుష్వారా నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి ఓవర్ ఫ్లో అయి నాలాల్లోకి వస్తున్న వరద నీటిని, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్బీ నగర్ పరిధిలోని హయత్ నగర్ సర్కిల్, నాగోల్ రాజరాజేశ్వరి కాలనీలో ముంపునకు గురైన ప్రాంతాలను, కర్మన్‌ఘాట్ మేఘా ఫంక్షన్ హాల్ పక్క నుంచి వెళ్తున్న మీర్‌పేట నాలాను, బైరామల్‌గూడ నాలాల నుంచి వచ్చిన వరద నీటితో ముంపునకు గురైన కాలనీలను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం సరూర్‌నగర్ చెరువును పరిశీలించి అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించింది.
వర్షాలతో ఎగువన ఉన్న చెరువులు నిండి దిగువకు వచ్చిన వరదతో నాగోల్ ప్రాంతంలోని పలు కాలనీలు, ఇళ్లు దాదాపు ఆరు అడుగుల మేర ముంపునకు గురయ్యాయని కేంద్ర బృందానికి బాధిత కుటుంబాలు విన్నవించాయి. ఈ ప్రాంతానికి మూసీ నది ఒక కిలోమీటరు దూరంలో ఉందని.. వరదతోపాటు పైన ఉన్న అన్ని చెరువులను అనుసంధానం చేస్తూ ఓవర్ ఫ్లో అయ్యే నీటిని మూసీ నదిలో కలిపేందుకు నాలాను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల, జీహెచ్ఎంసీ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికై మూసీకి కలుపుతూ నాలాను విస్తరింప జేసేందుకు అనువైన డిజైన్ల తయారీని కన్సల్టెన్సీకి అప్పగించినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు.