వస్త్రంతో తయారైన మాస్కులు వాడుతున్నారా?

నియమానుసారం వాడితేనే కొవిడ్‌-19 దరిచేరకుండా సమర్ధవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు.

Published : 12 Oct 2020 21:18 IST

అవి ఇలా అయితేనే పనిచేస్తాయట..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌కు రక్షణగా ఉపయోగించే వస్తువుల్లో అతి ముఖ్యమైనది మాస్కు. ముఖానికి ధరించే వీటిలో అనేక రకాలున్నా..  ప్రజలు ఎక్కువగా వాడుతున్నది, అందరికీ అందుబాటులో ఉన్నదీ వస్త్రంతో తయారయ్యే మాస్కులనే అని చెప్పాలి. అయితే వీటిని నియమానుసారం వాడితేనే కొవిడ్‌-19 దరిచేరకుండా సమర్ధవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. సర్జికల్‌ లేదా గుడ్డతో చేసినవైనా మాస్కులను ఒకసారి వాడిన అనంతరం కలుషితమైనవిగానే భావించాలని వారు చెపుతున్నారు. మరల వాడాలంటే వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉతికి, శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన పరిశోధకులు 2015 నాటి ఓ అధ్యయనంలో లభించిన సమాచారాన్ని విశ్లేషించారు. దీని ప్రకారం వైద్య అవసరాలకు ఉపయోగించే సర్జికల్‌ మాస్కులను ఒకసారి మాత్రమే  వినియోగిస్తారు కనుక వాటితో సమస్య లేదని.. మరల మరల ఉపయోగించే గుడ్డ మాస్కుల విషయంలోనే జాగ్రత్త వహించాలని ప్రొఫెసర్‌ రైనా మెక్లింటైర్‌ హెచ్చరిస్తున్నారు. ఒకే మాస్కును వరుసగా రోజుల తరబడి ఉపయోగించటం కూడదంటున్నారు. అలానే దానిని చేతితో సాధారణ వస్త్రం మాదిరిగానే ఉతికి మరల వాడటం ప్రమాదాన్ని మరింత అధికం చేస్తుందట. గుడ్డ మాస్కులను చేతిలో ఉతికితే చాలినంత రక్షణ ఉండదని వారు అంటున్నారు. కాగా, ఆస్పత్రిలో మాదిరిగా శాస్త్రీయ విధానాల్లో (ఆర్‌సీటీ) ఉతికిన వస్త్ర మాస్కులు కొత్త సర్జికల్‌ మాస్కులతో సమానంగా పనిచేస్తాయని తేల్చారు. అందుకే వాటిని ఒక్క రోజు ఉపయోగించిన అనంతరం శుభ్రంగా ఉతికిన తర్వాత మాత్రమే మరోసారి ధరించాలని వారు అంటున్నారు. బీఎంజే ఓపెన్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ తాజా అధ్యయనంలో ఆర్‌సీటీ విధానంలో శుభ్రంచేసిన గుడ్డ మాస్కులు మాత్రమే వైరల్ ఇన్ఫెక్షన్లను నిరోధించగలుగుతున్నాయని తెలిసింది.
60 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత గల నీటిలో, డిటర్జెంట్‌తో, వాషింగ్‌ మెషీన్‌ సహాయంతో మాస్కులను ఉతకాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిందని.. తమ అధ్యయనం కూడా ఈ విషయాన్నే తెలియ చేస్తోందని మెక్లింటైర్‌ తెలిపారు. గుడ్డ మాస్కులు బాగానే పనిచేస్తాయని అయితే ఒక సారి ధరించిన అనంతరం వాటిని సరైన విధానంలో శుభ్రం చేసినప్పుడు మాత్రమే వాటి వల్ల రక్షణ లభిస్తుందని లేదంటే అవి నిరుపయోగమేనని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని