మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు...

Updated : 12 Oct 2022 15:59 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. హరీశ్‌రావు ట్వీట్‌పై పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తన బావ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇతరుల కంటే హరీశ్‌రావు త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సోమవారం నుంచి తెలంగాణ ఆసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకొంటూ కొవిడ్‌ నిబంధనల మేరకు శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సమావేశాలకు వచ్చే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు... ప్రతి ఒక్కరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కొవిడ్‌ రిపోర్ట్‌తోనే సమావేశాలకు రావాలని స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారు రాకుండా ఉంటేనే మంచిదని, ఎవరైనా వస్తే వెనక్కి పంపిస్తామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని