కరోనా వైరస్ ‘ఎండెమిక్‌’గా మారబోతుందా‌?

ఏదైనా ఒక ప్రదేశంలో పునరావృతమవుతూ నిరంతరం వ్యాప్తి చెందే ‘ఎండెమిక్‌’ లక్షణంగా కరోనా వైరస్‌ మారే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

Published : 17 Oct 2020 01:29 IST

వ్యాక్సిన్‌ వచ్చినా..మళ్లీ మళ్లీ పునరావృతం!
అంచనా వేస్తున్న పరిశోధకులు

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనతికాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి రాబోయే రోజుల్లో స్థానపర వ్యాధి (ఎండెమిక్‌)గా మారనుందా..? వ్యాక్సిన్‌ వచ్చినా సాధారణ ఫ్లూ లాగానే తిరిగి వ్యాపిస్తుందా? కొన్ని భౌగోళిక ప్రదేశాలకు మాత్రమే పరిమితమై మళ్లీ మళ్లీ పునరావృతమౌతుందా? అనే ప్రశ్నలకు.. అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతంలో (మే నెలలో) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. మిజిల్స్‌‌ వంటి వ్యాధులకు టీకాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నిర్మూలించలేకపోయామని అభిప్రాయపడింది. తాజా పరిశోధనలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. ఏదైనా ఒక ప్రదేశంలో పునరావృతమవుతూ నిరంతరం వ్యాప్తి చెందే ‘ఎండెమిక్‌’ లక్షణంగా కరోనా వైరస్‌ మారే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఎన్నిచర్యలు చేపడుతున్నప్పటికీ అవన్నీ తాత్కాలికమేనని అర్థమవుతోంది. అంతేకాకుండా కరోనా వైరస్‌ సోకిన తర్వాత అది ఎంతకాలం శరీరంలో ఉంటుంది? యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో మానవులలో మళ్లీ మళ్లీ సోకే లక్షణమున్న సాధారణ వైరస్‌గానే కరోనా వైరస్‌ మారే అవకాశం ఉన్నట్లు కొలంబియా మెయిల్‌మాన్‌ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రీ-ఇన్‌ఫెక్షన్‌, వ్యాక్సిన్‌ లభ్యత, వ్యాక్సిన్‌ సమర్థత, సీజనాలిటీ వంటి అంశాలు దీనికి కారణాలుగా పేర్కొంటున్నారు. వీటితోపాటు కరోనా వైరస్‌ వ్యాప్తిని ప్రభావితం చేయగల మిగతా వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల చర్యలను కూడా వీరు గుర్తుచేస్తున్నారు.

వైరస్‌ సోకడం ద్వారా లేదా వ్యాక్సిన్‌ కారణంగా లభించిన రోగనిరోధక శక్తి ఓ సంవత్సరంలోపే తగ్గిపోతుందనే కోణంలో వీరు విశ్లేషించారు. ఇది స్థానిక వైరస్‌ల వల్ల కలిగే స్వల్ప అనారోగ్య సమస్యతో సమానం. ఇదే జరిగితే తదనంతర సంవత్సరం కూడా వైరస్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇతర స్థానిక కరోనా వైరస్‌ (ఎండెమిక్‌)ల సంక్రమణతో లభించే రోగనిరోధక శక్తి చాలాకాలం ఉండే అంశాన్ని కూడా విశ్లేషించారు. ఇది సాధ్యమైతే, ఇలా కొన్ని సంవత్సరాలు వైరస్‌ వ్యాప్తి పునరావృతమైన తర్వాత పూర్తిగా నిర్మూలించే వీలుంటుందని పేర్కొన్నారు. అయితే, వీటికి వ్యాక్సిన్‌ లభ్యత, దాని ప్రభావంతోపాటు ఇతర కాలానుగుణ అంశాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు.

దీనికోసం ముందుగా రీ-ఇన్‌ఫెక్షన్‌లు సాధారణమనే అంశాన్ని రుజువుచేయాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని ఎక్కువ జనాభాకు అందించడం ద్వారా వైరస్‌ను స్థానికంగా ఒకే ప్రాంతానికి పరిమితం అయ్యే ‘ఎండెమిక్’‌గా స్థిరపడనీయవచ్చు. అయితే, ఈ రీ-ఇన్‌ఫెక్షన్‌లు సాధారణమైనవా కాదా? అవి ఎంత తరచుగా జరుగుతాయి? తిరిగి వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి ఎంతమందికి సోకుతుంది? వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఎంత మేరకు ప్రభావం చూపుతాయి? అనే అంశాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయడ్డారు.

రీ-ఇన్‌ఫెక్షన్‌

కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు వృద్ధిచెందుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, రీ-ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఈ యాంటీబాడీలు సరిపోతాయా? అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడం, కొన్నిసార్లు ఇమ్యూనిటీ క్షీణించడం, ఉత్పరివర్తనాల వల్ల ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడం వంటి చర్యల ద్వారా రీ-ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుందని ఇతర వైరస్‌ల విషయంలో తేలింది. అయితే, గతంలో సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ రీ-ఇన్‌ఫెక్షన్‌ సమయంలో స్వల్ప రోగనిరోధక శక్తిని కలిగించడంతోపాటు లక్షణాల తీవ్రతను కాస్త తగ్గిస్తుందని తెలుస్తోంది.

కో-ఇన్‌ఫెక్షన్‌
కరోనా వైరస్‌ నుంచి రోగనిరోధక శక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి మరో వైరస్‌ బారినపడటం కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. ఒకవైరస్‌ సోకడానికి ముందు లేదా తర్వాత మరోవైరస్‌ బారినపడ్డ వారిలో ముందు ఇన్‌ఫెక్షన్‌ నుంచి లభించిన రోగనిరోధకత కేవలం స్వల్పకాలమే (వారం పాటు) రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. కానీ, ఏకకాలంలో సంక్రమించిన వైరస్‌ల ప్రభావం, వ్యాధి తీవ్రతను పెంచడంలో సంబంధం కలిగి ఉండవని పరిశోధనలు నిర్ధారించాయి.

సీజనాలిటీ
శీతాకాలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలు ఆధారాలున్నాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ఈ కాలంలో చాలా వైరస్‌లు విజృంభిస్తాయి. ఇన్‌ఫ్లుయెంజా మాదిరిగానే ఎండెమిక్‌ కరోనావైరస్‌ గ్రూపునకు చెందిన (OC43, HKU1, NL63, 229E) వైరస్‌లు బయటపడతాయి. అదేవిధంగా కరోనావైరస్‌ వ్యాప్తిని స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, మహమ్మారి ప్రారంభ దశలో వీటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. కానీ, శీతాకాలంలో పునరావృతమయ్యే ఇన్‌ఫ్లుయెంజా వంటి సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం, ఈ వైరస్‌లను ఎదుర్కోవడానికి సరిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇలా.. ప్రస్తుతం పాండెమిక్‌ (మహమ్మారి)గా ఉన్న కరోనావైరస్‌, ఎండెమెక్‌గా మరడానికి ఈ అంశాలు కారణమవుతాయని తాజా పరిశోధనలో పేర్కొన్నారు. ఈ పరిశోధన కరోనా వైరస్‌తోపాటు ఇన్‌ఫ్లుయెంజా వంటి మహమ్మారుల ప్రభావాలను అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరించిన కొలంబియా మెయిల్‌మాన్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ షమన్‌ నేతృత్వంలో కొనసాగింది. వైరస్‌ వ్యాప్తిలో అసింప్టమాటిక్‌ లక్షణాలు, లాక్‌డౌన్‌ చర్యల ప్రభావాలను గుర్తించిన వారిలో షమన్‌ ప్రథముడు. ఇక మరో పరిశోధకుడు గలాంటి రీ-ఇన్‌ఫెక్షన్‌పై పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని