ఐసీయూ బెడ్‌పైనే వివాహం!

వారివురు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు ఒక అర్థాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే వారి జీవితంలో కుదుపు.....

Published : 21 Aug 2020 02:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే వారి జీవితంలో కుదుపు. ఎందరో జీవితాలను కబళించిన కరోనా మహమ్మారి ఆ ప్రియుడికి సోకింది. ఏంచేయాలో తెలియక పెళ్లి వాయిదా వేసుకొని చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించడం ప్రారంభించారు.

కొద్దిరోజుల తర్వాత అతడి ఆరోగ్య స్థితి కొంత మెరుగుపడింది. అయినప్పటికీ అతడికి లైఫ్ సపోర్ట్ మాత్రం మరి కొద్ది రోజులు పాటు కొనసాగించాలని డాక్టర్లు సూచించారు. కానీ పెళ్లి చేసుకోవాలన్న కోరిక మాత్రం అతడిలో అలాగే ఉండిపోయింది. పరిస్థితి తెలుసుకున్న ఆస్పత్రి నర్సు అతడికి పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రియురాలు పెళ్లికి ఒప్పుకుంటుందో లేదోనని మనసులో చిన్న సందిగ్ధం. మదనపడుతూనే తన మసులోని కోరికను ప్రియురాలి ముందుంచాడు. అందుకు ఆమె కూడా అంగీకరించడంతో అతడి ఆనందానికి అంతేలేదు.

ఆస్పత్రిలోనే ఐసీయూ బెడ్‌పై నుంచి తనకు వైద్యం అందించే డాక్టర్లు, సేవ చేసే నర్సుల సాక్షిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పెళ్లి ప్రమాణం చేశాడు. అలా ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అమెరికా టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియా మెతోడిస్ట్ ఆస్పత్రి వేదికైంది. ఆ ప్రియుడి పేరు కార్ల్స్‌ మునిజ్‌, అతడి ప్రియురాలు లీమానీ. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కార్ల్స్‌ పరిస్థితి కొంత మెరుగైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని