దిల్లీలో మళ్లీ క్షీణించిన వాయు నాణ్యత

బలమైన గాలులు వీయడంతో దేశరాజధానిలో శుక్రవారం వాయునాణ్యత గణనీయంగా మెరుగుపడింది. కానీ 24 గంటల్లో పరిస్థితి మళ్లీ మునుపటికి చేరింది.

Published : 28 Nov 2020 23:42 IST

దిల్లీ: బలమైన గాలులు వీయడంతో దేశరాజధానిలో శుక్రవారం వాయునాణ్యత గణనీయంగా మెరుగుపడింది. కానీ 24 గంటల్లో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చేసింది. శనివారం ఉదయం దిల్లీ వాయునాణ్యతాసూచీ(ఏక్యూఐ) బాగా క్షీణించి 209కు చేరింది. శుక్రవారం గాలులు బలంగా వీయడంతో పాటు, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే సమయం పూర్తవ్వడంతో వాయునాణ్యత మెరుగుపడింది. కానీ, గాలి తక్కువగా ఉన్న సమయంలో కాలుష్యకారకాలు భూమికి దగ్గరగా ఉండి హాని కలిగిస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం కూడా కాలుష్య స్థాయి పెరిగేందుకు కారణమవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం దిల్లీ గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. శుక్రవారం గాలి వేగం గంటకు 18 కి.మీ ఉండగా శనివారం అది 15 కి.మీగా ఉంది.  శుక్రవారం సగటు ఏక్యూఐ 137, గురువారం 302, బుధవారం 413గా నమోదయ్యింది. ఏక్యూఐను 0-50 మధ్య ఉంటే నాణ్యత బావుందని, 51-100 ఉంటే సంతృప్తికరమని, 100-200 ఉంటే మధ్యస్థంగా ఉందని, 201-300 ఉంటే ప్రమాదకరమని, 301-400 ఉంటే అత్యంత ప్రమాదకరమని, 401-500 ఉంటే తీవ్రమైన ప్రమాదహేతువుగా నిపుణులు పేర్కొంటారు. ప్రతియేటా శీతాకాలంలో దిల్లీ వాయునాణ్యత తీవ్రంగా పడిపోతోంది. ప్రభుత్వం దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రజలు వారి కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ వాయుకాలుష్యం దిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విశ్రాంతి కోసం దిల్లీ నుంచి గోవాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని