ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

గత రెండు రోజులుగా ఉద్ధృతంగా ఉన్న కృష్ణానది వరద క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 5,99,000 క్యూసెక్కుల...

Published : 29 Sep 2020 11:28 IST

అమరావతి: గత రెండు రోజులుగా ఉద్ధృతంగా ఉన్న కృష్ణానది వరద క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీకి 5,99,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 5,91,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వదర నీరు వచ్చి చేరుతోంది. కృష్ణలంక, తోట్లవల్లూరు, భూపేష్‌నగర్‌, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లోని లంకగ్రామాలతో పాటు  గుంటూరు జిల్లాలోని కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు తదితర ప్రాంతాల్లోని లంక భూములు వరదనీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో పూర్తి  స్థాయిలో 3.07 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. బ్యారేజీలో 57 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. 

బ్యారేజీ సామర్థ్యం కంటే ఎక్కువ వరద వస్తుండటంతో 70గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సాయంత్రానికి వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మొత్తంమీద ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి దాదాపుగా 578టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో నీటి విడుదల నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా పెరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 


 

మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు కూడా వదర ప్రవాహం తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి 1,59,260 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. జలాశయం 9గేట్లు ఎత్తి 2,77,753 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 884.30 అడుగుల మేర నీటి మట్టం ఉండగా.. నీటి నిల్వ 211.47టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. 

 పులిచింతల ప్రాజెక్టుకు కూడా ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గింది. పులిచింతలకు ఎగువ నుంచి 2.30లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా 1.53లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా..  ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 43.79 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని