
ఆకలి తట్టుకోలేక ఆ ఏనుగులు ఏం చేశాయంటే..
కొలంబో: అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవుతుంటే.. ఆహారం, ఆవాసం కరువై ఏనుగులు ఊళ్లపై దాడిచేసిన ఘటనలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. పంట పొలాలను ధ్వంసం చేయడం, మనుషులపై దాడికి పాల్పడటం, ప్రమాదాలను గుర్తించలేక ప్రాణాలు కోల్పోయిన ఏనుగుల గురించి చదువుతూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలే ప్రపంచంలో చాలాచోట్ల జరుగుతూనే ఉన్నాయి. శ్రీలంకలో తిండి దొరక్క ఏనుగుల సమూహం చెత్త కుప్పపై పడి ఆకలి తీర్చుకుంటున్న హృదయవిదారక దృశ్యమే అందుకు నిదర్శనం. అక్కడి అంపార వన్యప్రాణుల అభయారణ్యానికి సమీపంలో కనిపించిన ఈ దృశ్యాన్ని జాఫ్నాకు చెందిన ఫొటో గ్రాఫర్ థర్మపాలన్ తిలక్సన్ కెమెరాలో బంధించారు. కలత పెట్టిస్తున్న ఆ చిత్రం ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ బయోలజీ(ఆర్‌ఎస్‌బీ) ఇచ్చే ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ‘స్టోరీ ఆఫ్ పల్లకద్దు ఎలిఫెంట్స్’ అనే శీర్షికతో థర్మపాలన్ ఆ ఫొటోను పోటీలకు పంపారు. ఈ అవార్డు కింద ఆయన 1000 పౌండ్ల ప్రైజ్‌మనీని కూడా గెలుచుకున్నారు. కాగా, ‘అవర్ ఛేజింగ్ వరల్డ్’ అనే థీమ్‌తో ఆర్‌ఎస్‌బీ ఈ పోటీలను నిర్వహించింది. ఇదిలా ఉండగా..ఈ తరహా ఘటనలను నివారించే ఉద్దేశంతో 2017లో శ్రీలంక ప్రభుత్వం అభయారణ్యాల పక్కన చెత్త వేయడాన్ని నిషేధించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.