ఈ ‘గజ’దొంగపై చర్యల్లేవు..

పట్ట పగలు, నడి రోడ్డు మీదే బస్సును ఆపి చోరీ చేసిన ఓ ‘గజ’దొంగపై.. ఏ పోలీసులూ చర్య తీసుకోలేదు.

Updated : 13 Nov 2020 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పట్ట పగలు, నడి రోడ్డు మీదే బస్సును ఆపి చోరీ చేసిన ఓ ‘గజ’దొంగపై.. ఏ పోలీసులూ చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఆ దొంగతనం చేసింది ఓ ఏనుగు కాబట్టి! కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఓ అటవీశాఖ అధికారి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఈ ఆసక్తికర వీడియో శ్రీలంకలోని కాటరంగమ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనిలో.. రోడ్డు మధ్యలో ఓ ఏనుగు నిలిచి ఉండటంతో బస్సు డ్రైవరు వాహనాన్ని స్లో చేశాడు. బస్సు తన పక్కకు వచ్చిన అనంతరం ఏనుగు తన తొండాన్ని కిటికీ లోంచి లోపలికి పెట్టి.. అక్కడ ఉన్న ఆహారాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. ఈయత్నంలో ఆ ఏనుగు అక్కడ ఉన్న అరటిపళ్లను దొరికించుకుంది. ఆ విధంగా ఏనుగుకు ‘టోల్‌ టాక్స్‌’ చెల్లించిన డ్రైవరు బతుకు జీవుడా అంటూ బస్సును ముందుకు పోనిచ్చాడు.

ఇక ఈ సంఘటనకు బస్సులోని ప్రయాణికుల్లో కొందరు ఆశ్చర్యంతో షాక్‌ తినగా.. మరికొందరు గట్టిగా నవ్వడాన్ని మనం గమనించవచ్చు. కాగా, అడవి జంతువులకు ఆహార పదార్ధాలను తినిపించడం సరికాదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఆ జంతువులు అలవాటుపడి.. మనుషులు, వాహనాల సమీపానికి వచ్చేస్తూ ఉంటాయని.. అది వాటికీ, మనుషులకూ కూడా క్షేమం కాదని వారు అంటున్నారు. మరి ఈ గజదొంగను మీరూ చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని