వ్యాయామం... వారికి దివ్యౌషధం!

షుగర్‌తో బాధపడేవారు మందులు తీసుకోవటం, ఆహార నియమాలు పాటించటం వంటివి మాత్రమే చేస్తే సరిపోదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే... మరోవైపు అవసరమైనంత మేరకు వ్యాయామాలు చేయాలి. రోజుకు అరగంట సేపైనా వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్‌ శాతం అదుపులో ఉంటుందని చెప్తారు నిపుణులు.

Published : 26 Dec 2020 16:51 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌ : షుగర్‌తో బాధపడేవారు మందులు తీసుకోవటం, ఆహార నియమాలు పాటించటం వంటివి మాత్రమే చేస్తే సరిపోదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే... మరోవైపు అవసరమైనంత మేరకు వ్యాయామాలు చేయాలి. రోజుకు అరగంట సేపైనా వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్‌ శాతం అదుపులో ఉంటుందని చెప్తారు నిపుణులు. నిత్యం వ్యాయామం చేయటం మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగకరమట!

ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే ఎరోబిక్‌ వ్యాయామాలు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. వ్యాయామం వల్ల గ్లూకోజ్‌ నియంత్రణలో ఉంటుంది. గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇంకెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేసేవారిలో బరువు తగ్గక పోయినా కూడా మూడు నెలల కాలంలో గ్లూకోజ్‌ సగటును తెలిపే హెచ్‌బీఏవన్‌సీ 0.7 శాతం మెరుగుపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 

ఏమాత్రం వ్యాయామం చేయని మధుమేహులతో పోల్చితే, వారానికి కనీసం రెండు గంటల పాటు నడిచిన వారికి గుండె జబ్బులతో మరణించే ముప్పు తక్కువ. వ్యాయామంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. నడవటం, నెమ్మదిగా పరుగెత్తటం సైక్లింగ్‌, ఈత వంటివి గుండె వేగం పెరిగేలా చేస్తాయి. ఇన్సులిన్‌ సమర్థంగా పనిచేయటానికి ఇది తోడ్పడుతుంది. కిడ్నీలు, మెదడు, గుండె, కళ్లు తదితర అవయవాలకు రక్త ప్రసరణ ఇనుమడిస్తుంది.

వ్యాయామం చేసినపుడు అన్ని కణజాలాలకు ఆక్సీజన్‌, పోషకాలు అందుతాయి. గుండె రక్తనాళాల వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్‌ వంటి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో మెదడులో ఎండార్ఫిన్‌లు అనే సమాచార వాహకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మానసిక ఉల్లాసానికి ఇవి తోడ్పడతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు బలోపేతం కావాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 

దీనివల్ల కండరాల జీవప్రక్రియల వేగమూ పెరుగుతుంది. అంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ కేలరీలు ఖర్చు అవుతుంటాయి. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. వ్యాయామం చేయటం వల్ల గుండె బలోపేతం అవుతుంది. తక్కువ శ్రమతో రక్తాన్ని పంపు చేయగులుగుతుంది. ఫలితంగా ధమనులపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అయితే వ్యాయామం విషయంలో మధుమేహులు కచ్చితంగా డాక్టర్ల సలహాలు తీసుకోవాలి. ఇన్సులిన్‌ తీసుకున్న వారైతే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం చేయటానికి ముందు గ్లూకోజ్‌ స్థాయిలను పరీక్షించుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని