Published : 25 Nov 2020 01:57 IST

కూతురు కోసం.. అమ్మ చేసిన యాప్‌!

చిత్రం: తన ట్విటర్‌ ఖాతా నుంచి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘విద్య ఒంటరిగా వెళ్లకు అన్నయ్యని తోడుగా తీసుకెళ్లు..’ పరీక్ష కేంద్రానికి వెళ్తున్న విద్యకి వాళ్లమ్మ చెబుతున్న మాటలు. ‘చిన్ని త్వరగా వచ్చేయ్‌. ఇప్పుడు ఒక్కదానివే బయటకి వెళ్లడం అంత అవసరమా?’ అంటూ కోప్పడుతున్న చిన్ని వాళ్లమ్మ. ఇలా ఓ అమ్మాయిని ఒంటరిగా బయటికి పంపాలంటే భయపడే అమ్మలెందరో.. ఇంటికి వచ్చే వరకూ గంటగంటకీ ఫోన్‌ చేసే అమ్మలెందరో.. అలాంటి ఓ అమ్మ తన కూతురి భద్రత కోసం ఓ యాప్‌నే రూపొందించింది. ఇప్పుడు తన చిన్నారిలాంటి ఎంతో మంది ఆడపిల్లలకి వెన్నుదన్నుగా, తనలాంటి అమ్మలకు అండగా నిలుస్తోంది తను తయారుచేసిన ఆ యాప్‌. ఇంతకీ ఎవరామె? ఏంటా యాప్‌? ఎలా పని చేస్తుంది? తెలుసుకుందాం.

దిల్లీలో నివాసముండే మధురీటా ఆనంద్ రచయిత, ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌మేకర్‌గా విధులు నిర్వహిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం దిల్లీలోని ఓ వీధిలో కొందరు ఆకతాయిలు అటువైపుగా వస్తున్న తనని అడ్డుకున్నారు. ఇంటికి వెళ్లనీయకుండా తెగఇబ్బంది పెట్టారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని భయంభయంతో ఇంటికి చేరుకుంది మధు. ఒకవేళ తన కూతురికే ఇలాంటి సంఘటన ఎదురైతే.. అనే ఆలోచనే ఊహించలేకపోయింది. కానీ, స్నేహితుల వద్దకు వెళ్లిన తన కూతుర్ని మాటిమాటికీ ఫోన్‌ చేసి రమ్మనడం, ఎక్కడుందో తెలుసుకునేందుకు తన మిత్రులకు ఫోన్‌ చేయడం, బయటకి వెళ్లకూడదని ఇబ్బంది పెట్టడం తనకు నచ్చదు. అమ్మాయిలకు స్వేచ్ఛనివ్వాలనుకునే వ్యక్తిత్వం తనది. కానీ పదహారేళ్ల తన కూతురు బయటకి వెళ్లిన ప్రతిసారి భయపడుతూనే ఉంటుంది. ఎప్పుడొస్తుందా అని గడియారం వైపే చూసేది. ఇక ఆ రోజుతో ఆడపిల్లల రక్షణ కోసం ఏదైనా చేయాలనుకుంది. ఓ అమ్మాయి వెళ్లదలచుకున్న ప్రాంతం ఎంత వరకూ సురక్షితమైంది? వంటి ప్రశ్నకు సమాధానం తెలిపే వేదికలేమైనా ఉన్నాయేమో అని ఆన్‌లైన్‌లో గాలించింది. కానీ అలా అసురక్షితమైన ప్రాంతాలను తెలిపే ఏ ఒక్క వేదిక తనకి కనిపించలేదు. దీంతో భద్రతా రేటింగ్‌ని అందించే ఓ యాప్‌ తనే రూపొందిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. వచ్చిన ఆలోచనని తన మిత్రుడు ప్రదీప్‌తో పంచుకుంది. అలా ‘Phree App’ని రూపొందించారు. ఇదో ‘సేఫ్టీ రేటింగ్‌’ యాప్‌. 

ఎలా పని చేస్తుంది?
మహిళా భద్రత నిమిత్తం ఇప్పుడు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలా వరకు ప్రమాదంలో ఉన్న సమయంలో హెచ్చరిక జారీ చేసేందుకు, కుటుంబ సభ్యులకు సంకేతాలు ఇచ్చి వారికి తెలిపేందుకే ఉపయోగపడతాయి. ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌ సేవలూ హెచ్చరిక బటన్‌ను అందుబాటులో ఉంచాయి. కానీ, ఈ యాప్‌తో మీరు వెళ్లదలచుకున్న ప్రదేశం ఎలాంటిదో ముందే తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రజలు, ముఖ్యంగా మహిళలు వివిధ ప్రాంతాలు, వీధులకు భద్రత కోసం రేటింగ్‌ ఇవ్వవొచ్చు. ఇలా వచ్చిన రేటింగ్‌తో సురక్షితంకాని ప్రాంతాలను సులభంగా గుర్తించొచ్చు. ఆ వైపు వెళ్తున్నప్పుడు అప్రమత్తమవొచ్చు. గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి వినియోగదారుల భద్రత కోసం వివిధ ప్రాంతాలను మూడు విభాగాలుగా పొందుపరిచారు. ఉదాహరణకు ఏదైనా కేఫ్‌, జిమ్‌, మాల్‌ వంటిది సురక్షితం కాదని వినియోగదారుడు భావిస్తే మ్యాప్‌లో ఒక సమీక్షతో గుర్తించాలి. దాంతో వివిధ ప్రాంతాలు ఎలాంటివో వినియోగదారులు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఒక్క క్లిక్‌తో మీ ఫోన్‌ కాంటాక్ట్‌కి అలర్ట్‌ కూడా పంపొచ్చు. 10కి.మీ విస్తీర్ణంలో పనిచేస్తుంది. ప్లే స్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంది. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని