
ఏపీలో తొలి స్ట్రెయిన్ కేసు నమోదు
అమరావతి: ఏపీలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసు నమోదైంది. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అధికారికంగా వెల్లడించారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది.
రాజమహేంద్రవరం మహిళ నుంచి మరెవరికీ స్ట్రెయిన్ సోకలేదని కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూకే స్ట్రెయిన్ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలులేవని చెప్పారు. అపోహలను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్ట్రెయిన్ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి..
Advertisement