
Published : 28 Jul 2020 23:10 IST
వలకు చిక్కిన భారీచేప.. ధర రూ.50వేలు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఏనుగు చెవుల ఆకారంలో ఉండే ఈ చేప బరువు 780కిలోలు. స్థానికంగా దీన్ని శంకర్ చేప అని పిలుస్తారు. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ భారీ మీనం ధర చేపల మార్కెట్లో రూ.50వేలు పలకడం విశేషం.
ఒడిశాకు సమీపంలోని డిఘా వద్ద ఉన్న ఉదయ్‌పూర్ బీచ్‌లో ఈ చేప చిక్కింది. ఇంతవరకు ఇంతపెద్ద చేప తమకెప్పుడూ పడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. శంకర్ చేపగా పిలవబడే దీన్ని బెంగాల్లో ఎక్కువగా తింటారు. మార్చి నెలలో కూడా ఇదే రకానికి చెందిన 300 కిలోల చేప మత్స్యకారుల వలకు చిక్కింది.
Tags :