జీహెచ్‌ఎంసీ ఎన్నికలు..మార్గదర్శకాలు జారీ

రాష్ట్రంలో కొవిడ్‌ దృష్ట్యా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు...

Updated : 20 Nov 2020 16:01 IST

వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్‌ దృష్ట్యా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలతో కూడిన మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర వైద్యారోగ్య, హోం శాఖ నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు రూపొందించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. ఎస్‌ఈసీ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటించాలని.. అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలని.. ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది.

మరిన్ని మార్గదర్శకాలు ఇవే..

* కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్ల, నివారణ చర్యలను పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ, సర్కిల్, వార్డుల వారీగా నోడల్ హెల్త్ అధికారుల నియామకం చేపట్టాలి. 
* పెద్ద హాల్స్‌లో వికేంద్రీకరణ పద్ధతిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. వర్చువల్ ట్రైనింగ్‌ను ఉపయోగించుకోవచ్చు.
* ఎన్నికల సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారికి బదులుగా ఉపయోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులు, కమిషనర్  సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.
* నామినేషన్ సమయంలో అభ్యర్థితో ఇద్దరికి మాత్రమే అనుమతి. వాహనాల సంఖ్య రెండుకు పరిమితం చేశారు.
* ఎన్నికలు జరిగే ముందు పోలింగ్ కేంద్రాన్ని తప్పకుండా శానిటైజ్‌ చేయాలి.
* దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్న వారు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం వినియోగించుకోవచ్చు.
* భద్రతా సిబ్బంది మినహా ఐదుగురి బృందం మాత్రమే ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు.
* ప్రచారానికి వినియోగించే కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి.
* రెండు పార్టీలు లేదా అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అర్ధగంట విరామం ఉండాలి.
* కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రచార సమావేశాలు నిర్వహించాలి. 
* ఒక కౌంటింగ్ హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదు. కౌంటింగ్ ముందు బ్యాలెట్ బాక్సులను శానిటైజ్ చేయాలి.
* కౌంటింగ్‌కు ముందు, తర్వాత కౌంటింగ్ సెంటర్లను డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. అవసరమైతే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రత్యేక హాల్స్‌లో చేపట్టాలి.

ఇవీ చదవండి..

జీహెచ్‌ఎంసీలో మోగిన ఎన్నికల నగారా

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పవన్‌ కీలక నిర్ణయం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని