ఈ సిటీల్లో 70+ అంతస్తుల భవంతులు కట్టొచ్చు!

గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో ఆకాశహర్మ్యాలను తాకే భారీ ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు ఇకపై దర్శనమివ్వనున్నాయి. 70 అంతకన్నా ఎక్కువ అంతస్తున్న భవంతుల నిర్మాణానికి సీఎం........

Updated : 06 Sep 2022 16:31 IST

 గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఆమోదముద్ర

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో ఆకాశహర్మ్యాలను తాకే ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు ఇకపై దర్శనమివ్వనున్నాయి. 70 అంతకన్నా ఎక్కువ అంతస్తులు ఉన్న భవంతుల నిర్మాణానికి సీఎం విజయ్‌ రూపానీ మంగళవారం ఆమోద ముద్రవేశారు. రాష్ట్రంలోని ఐదు నగరాల్లో మాత్రమే ఇలాంటి ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం గరిష్ఠంగా 23 అంతస్తుల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉండగా.. తాజాగా అంతకు దాదాపు మూడు రెట్లకు పైగా ఎత్తైన భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఇందుకోసం జనరల్‌ డెవలప్‌మెంట్‌ కంట్రోల్‌ రెగ్యులేషన్‌ చట్టానికి సవరణలు తేవాలని సీఎం నిర్ణయించినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

అనుమతులు ఈ నగరాలకే.. 
అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌, గాంధీనగర్‌లలో మాత్రమే 70కి పైగా అంతస్తులతో ఎత్తైన భవనాలు నిర్మాణం చేపట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆకాశాన్ని తాకే ఇలాంటి భవనాలకు అనుమతులకు సంబంధించిన కొత్త నిబంధనలు 100 మీటర్ల ఎత్తుకన్నా అధికంగా ఉండే నిర్మాణాలకు వర్తించనున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు వీలుగా ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఇళ్ల ధరలు తగ్గించడంలో దోహదపడతాయని సీఎం రూపానీ విశ్వాసం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని