ఎల్బీనగర్‌ వద్ద 2కి.మీల మేర ట్రాఫిక్‌ జామ్‌!

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్‌ వద్ద జాతీయ రహదారి డైవైడర్‌ నుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది..........

Updated : 17 Oct 2020 23:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్‌ వద్ద జాతీయ రహదారి డైవైడర్‌ పైనుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది. దీంతో దాదాపు రెండు కి.మీ.లమేర వాహనాలు నిలిచిపోయాయి. పనామా - ఎల్బీనగర్‌ రహదారి జలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్‌లో ఈ రోజు దాదాపు 7సెం.మీల మేర వర్షం కురిసింది. మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్‌, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారిమళ్లిస్తున్నారు. 

పాతబస్తీలోని బాబానగర్‌లో భారీగా వరద నీరు పారుతోంది. బాలాపూర్‌ చెరువు నీళ్లతో వీధుల్నీ జలమయమయ్యాయి. గోల్నాక కొత్త వంతెనపై భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. ముసారాంబాగ్‌ వంతెనపై రాకపోకలు నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారిమళ్లింపుతో  అక్కడ రద్దీ పెరిగింది. శంషాబాద్‌, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.  ఉప్పల్‌లో వరంగల్‌ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి ఫలక్‌నుమా ఓవర్‌ బ్రిడ్జిపై గుంత ఏర్పడింది. గతంలో వర్షానికి మూడు రోజుల పాటు ఈ వంతెన జలదిగ్బంధంలోనే ఉంది. 

బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గగన్‌పహాడ్‌ వైపు రాకపోకలను నిలిపివేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా బెంగళూరు, విమానాశ్రయం వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.  బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి..

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని