కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇలా..

కొన్ని నెలల్లో భారతదేశమంతటా కొవిడ్‌-19 టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తమ ప్రణాళికలు వివరించింది.

Published : 16 Dec 2020 01:54 IST

దిల్లీ: కొన్ని నెలల్లో భారతదేశమంతటా కొవిడ్‌-19 టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తమ ప్రణాళికలు వివరించింది. ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకు వీలుగా 29వేల కోల్డ్‌ చైన్‌ స్పాట్లు, 240  కూలర్లు, 70 ఫ్రీజర్లు, 45 వేల రిఫ్రిజిరేటర్లు, 41వేల డీప్‌ ఫ్రీజర్లు, 300 సోలార్‌ రిఫ్రిజిరేటర్లు ఉపయోగిస్తున్నామన్నారు. అవసరమైన వనరుల్ని ఇప్పటికే రాష్ట్రాలకు పంపామని తెలిపారు. రాష్ట్రాల టాస్క్‌ ఫోర్సు, స్టీరింగ్‌ కమిటీలతో ఇప్పటికే సమావేశాలు పూర్తయ్యాయని తెలిపారు. వైద్యాధికారుల నుంచి ఆశా కార్యకర్తల వరకూ ఇవ్వాల్సిన వ్యాక్సిన్‌ శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికే ఖరారు చేశామని ఆయన తెలిపారు. ఇప్పటికే శిక్షకులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. ‘‘ఇంత పెద్దమొత్తంలో వ్యాక్సిన్‌ను ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నపుడు దాని వెనుక వచ్చే ప్రతికూల అంశాలకు కూడా మనం సిద్ధమై ఉండాలి. టీకా ఇచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు, పిల్లల్లో కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే టీకా పంపిణీ ప్రారంభమైన యూకేలో మొదటిరోజే ఈ ప్రభావం కనిపించింది. కాబట్టి రాష్ట్రాలు దీనికి కూడా సిద్ధమై ఉండాలి. ’’ అని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. కేంద్రం ముందుగా ప్రకటించిప మార్గదర్శకాల ప్రకారం రోజుకు వందమందికి మాత్రమే టీకాను వేయనున్నారు. వారందరూ ముందుగా కోవిన్‌ యాప్‌లో వారి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ యాప్‌లో నమోదు చేసుకున్నవారే టీకా వేయించుకొనే ప్రాంతానికి రావాలి. టీకా వేయించుకున్న తర్వాత 30 నిమిషాల పాటు వారు పరిశీలనలో ఉండాలి. ఆ తర్వాతే వారిని పంపుతారు. దీనికోసం ప్రజలు ముందుగా కోవిన్‌ యాప్‌లో తమ గుర్తింపుకార్డుల ఆధారంగా నమోదుచేయించుకోవాలి. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు టీకా ముందుగా వేస్తారు. తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యతనిస్తారు. మొదటి దశ టీకా పంపిణీలో భాగంగా సుమూరు 30 కోట్ల మందికి టీకా వేస్తారని తెలిపారు.  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా 50 ఏళ్లు పైబడిన వారిని గుర్తిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇవీ చదవండి..

టీకా పంపిణీ చర్యలు వేగవంతం

టీకా పంపిణీపై కేంద్రం మార్గదర్శకాలివే..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని