Published : 10 Dec 2020 00:16 IST

ఆస్తమా ప్రభావానికి అడ్డుకట్ట వేయండిలా!ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆస్తమా బాధితులకు చలికాలం కాస్త గడ్డుకాలం అనే చెప్పవచ్చు. మిగతా సీజన్‌లతో పోల్చినపుడు ఈ కాలంలో చల్లని వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్తమా ఉద్ధృతం అవుతుంది. దీంతో ఊపిరి సరిగా అందకా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే సీజన్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారం, వ్యాయామాలతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి చర్యల ద్వారా చలికాలంలోనూ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓ లుక్కేద్దామా!

చలికాలంలో ఆస్తమా అత్యంత ప్రమాదకారి. మిగతా వారికి ఎలా ఉన్నా ఆస్తమా బాధితులు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. శీతాకాలంలో వైరస్‌, బాక్టీరియాలతో నిండిన చలిగాలుల ధాటికి ఆస్తమా తరచూ తీవ్రంగా మారుతుంది. దీని బారిన పడిన వారిలో అప్పటికే కుచించుకు పోయిన శ్వాస మార్గాలు మరింతగా ఇబ్బంది పెడతాయి. దీంతో బాధితులు ఒడ్డున పడినచేపల్లా విలవిల్లాడాల్సి వస్తుంది. ఈ కాలంలో జలుబు రాకుండా చూసుకోవటం అత్యవసరం. ఒకవేళ వచ్చినా సాధ్యమయినంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్సా తీసుకోవాలి. రోజు వారీ ఆహారంలో ఉల్లి, వెల్లులి వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చని నీటితో వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్‌ తైలాన్ని కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. 

ఆస్తమాతో బాధపడేవారు వామును బెల్లంతో కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని ఒకగ్లాసు మజ్జిగలో కలపి తీసుకోవటం వల్ల కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రం అవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లం ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజు వారీ ఆహారంలో అల్లం తప్పనిసరిగా వాడుకోవాలి. గోరువెచ్చని నీటికి కాసింత నిమ్మరసం కలిపి పరగడుపున తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లని పదార్థాలకు, చల్లని వాతావరణానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. 

అంతేకాదు ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దుమ్ము, ధూళి, కాలుష్యాలకు దూరంగా ఉండాలి. గదులలో వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని నిండుగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. స్వెట్టర్‌లు, రగ్గులు వంటివి శుభ్రంగా ఉతికిన తరువాతే ఉపయోగించాలి. కాసేపు నడవటం, ఈత కొట్టడం, యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు వంటివి చేయాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల చలికాలంలో ఆస్తమా ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని