7 నుంచి మెట్రో.. రాత్రి 9 గంటల వరకే!

నగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Published : 04 Sep 2020 01:31 IST

హైదరాబాద్‌: నగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. ప్యాసింజర్‌లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. భౌతిక దూరాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. మెట్రో రైలు ప్రయాణికులు మాస్క్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని.. లేనిపక్షంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేస్తామన్నారు. స్మార్ట్‌ కార్డు, క్యాష్‌ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

9 నుంచి అన్ని మార్గాల్లో..
* మెట్రో రైళ్లను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఫేజ్‌-1లో భాగంగా ఈ నెల 7న తొలుత కారిడార్‌-1 (మియాపూర్‌ - ఎల్‌బీ నగర్‌) పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు; తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
* ఫేజ్‌-2 కింద 8న కారిడార్‌-3 (నాగోల్‌- రాయ్‌దుర్గ్‌)లో మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటల నంచి 12 గంటల వరకు; సాయంత్రం 4 నుంచి 9 వరకు రైళ్లు నడవనున్నాయి.
* ఫేజ్‌-3 కింద ఈ నెల 9 నుంచి అన్ని కారిడార్లలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు ఉండనున్నాయి.
* తొలుత ఆయా మార్గాల్లో  ప్రతి ఐదు నిమిషాలకు ఓ రైలు నడుస్తుందని, రద్దీకి అనుగుణంగా సమయాన్ని పెంచడమా? తగ్గించడమా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మెట్రో ఎండీ తెలిపారు.
ఈ స్టేషన్లు మూత..
కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న స్టేషన్లను మూసివేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నగరంలోని గాంధీ హాస్పటల్‌, భరత్‌నగర్‌, మూసాపేట్‌, ముషీరాబాద్‌, యూసఫ్‌గూడ స్టేషన్లను మూసివేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని