Published : 20 Oct 2020 18:14 IST

వామ్మో వర్షం.. రౌండప్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ జంట నగరాల్లో మళ్లీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా వరుణుడి ప్రతాపంతో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వాన పడుతుందంటే చాలు.. జనం హడలిపోయే పరిస్థితి నెలకొంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కూడా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి మళ్లీ నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టంతో ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న జనం అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

ఆ వదంతులు నమ్మొద్దు: సబిత

మరోవైపు, మీర్‌పేటలోని పెద్ద చెరువు కట్ట తెగలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కట్టకు మరమ్మతులు చేశారని తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న మంత్రాల చెరువు వీడియో పాతదన్నారు. 


శిల్పారామాలకు సెలవులు
నగరంలో మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శిల్పారామాలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మాదాపూర్‌, ఉప్పల్‌ శిల్పారామాలకు రెండు రోజుల పాటు సందర్శకులకు అనుమతి లేదని అధికారులు స్పష్టంచేశారు. 


బాధితులకు కేటీఆర్‌ సాయం అందజేత 
ఖైరతాబాద్‌లోని ఎం.ఎస్‌. మక్తాలో మంత్రి  కేటీఆర్‌ పర్యటించారు. వరద నీటి ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు ప్రకటించిన రూ.10వేల సాయాన్ని వారికి అందజేశారు. ఎం.ఎస్‌.మక్తాతో పాటు రాజ్‌నగర్‌, షేక్‌పేటలోని ఎంజే కాలనీలలో ముంపు బాధితులను ఆయన కలిశారు. కేటీఆర్‌ వెంట మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు. 


వర్షపాతం వివరాలివీ..

మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. దమ్మాయిగూడ 50 మి.మీలు, కీసర 40.5 మి.మీల చొప్పున నమోదు కాగా.. మొయినాబాద్‌ 33.8, ఘట్‌కేసర్‌ 32.8, వనస్థలిపురం 29.8, హయత్‌నగర్‌ 29.8, ఎల్బీనగర్‌ 21.5, ముషీరాబాద్‌ 21, బండ్లగూడ 20.3, హబ్సిగూడ 17.8, గోల్కొండ 16.5, ఉప్పల్‌ 17.3, బేగంబజార్‌ 13.8, చార్మినార్‌ 13.5, మోండామార్కెట్‌ 12.8, హిమాయత్‌నగర్‌ 12 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.


నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌..
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.67 మీటర్లకు చేరింది. 


ఇళ్లల్లోకి వరద నీరు
రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురవడంతో పలు ఇళ్లలోకి వరదనీరు వెళ్లింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని