చినుకుపడితే ఉలిక్కిపడుతున్న ‘హైదరాబాద్‌’

హైదరాబాద్‌ నగరంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి జనం ఇంకా తేరుకోకముందే.. మళ్లీ సోమవారం వర్షం ప్రారంభమైంది. వర్షాలతో నగరంలోని అనేకచోట్ల..........

Updated : 19 Oct 2020 17:31 IST

వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ వర్షం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ నగరంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి జనం ఇంకా తేరుకోకముందే.. మళ్లీ సోమవారం వర్షం కురిసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చినుకు పడితే నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు. మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేసినట్టు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

వాహన చోదకులకు విజ్ఞప్తి

నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైందని, వాహన చోదకులు జాగ్రత్తగా వాహనాలు నడపాలంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.  సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఈ వర్షంతో కోఠి ఆంధ్రాబ్యాంక్‌, డీఎంహెచ్‌ఎస్‌, ఇసామియా బజార్‌, చాదర్‌ఘాట్‌ జంక్షన్‌ నుంచి నింబోలి అడ్డా రహదారి వైపు వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

జంట నగరాల్లోని పలు చోట్ల వర్షపాతం..

ఈ సాయంత్రం 4గంటల సమయానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. కూకట్‌పల్లి 25.8మి.మీలు బోరబండలో 25.5మి.మీల వర్షం కురవగా.. ఉప్పల్‌ 25.5 మి.మీలు, కుత్బుల్లాపూర్‌ 25.3, చార్మినార్‌ వద్ద 22.3మి.మీలు; బహుదూర్‌పుర 13.5, సైదాబాద్‌ 11.5; బండ్లగూడ 11.5, నాంపల్లి 10.5, తిరుమలగిరి 9.8; ముషీరాబాద్‌ 9.3; మైత్రీవనం 5.3; హిమాయత్‌నగర్‌ 4.8; మారేడ్‌పల్లి 4.8; మోండామార్కెట్‌ 4.3; అంబర్‌పేట 4.3మి.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.

వరదనీటిలో కొట్టుకుపోయిన బైక్‌

రంగారెడ్డి జిల్లా మునగనూరు నుంచి తొర్రూరు వెళ్లే రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న క్రమంలో వరద ధాటికి నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి కాపాడారు. అదేవిధంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. వరద ప్రవాహంలో వాహనం కొట్టుకుపోగా వారు సురక్షితంగా బయటపడ్డారు. వింజాపూర్‌ బాతుల చెరువు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. 

బుర్హాన్‌ చెరువు పరిశీలించిన మంత్రి సబిత

బాలాపూర్‌ పరిధిలోని బుర్హాన్‌ చెరువును మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అక్కడ వరదనీటితో నెలకొన్న పరిస్థితిని బాధితులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సూచించారు. ఆమెతో పాటు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని