రూ. 500కే కరోనా పరీక్ష!

అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ చేయగల విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు కనుగొన్నారు.

Published : 22 Oct 2020 01:18 IST

ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకుల ఆవిష్కరణ

ఖరగ్‌పూర్‌: అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారణ చేయగల విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు కనుగొన్నారు. ‘కొవిరాప్‌’ అనే ఈ పరికరం ఖరీదు కేవలం రూ.10,000 కాగా.. దీని ద్వారా ఒకసారి పరీక్ష చేసేందుకు అయ్యే ఖర్చు కూడా రూ.500 కావటం గమనార్హం. ఇక్కడి ప్రొఫెసర్లు సుమన్‌ చక్రబర్తి, డాక్టర్‌ అరిందమ్‌ మొండెల్‌ల నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించారు. కాగా, ఈ విధానానికి ఐసీఎంఆర్‌ అనుమతి కూడా లభించటం విశేషం. ఈ విధానం సులభమే కాకుండా.. ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చని పరిశోధకులు వివరించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల వైద్య ఆవిష్కరణ ప్రశంసనీయమని.. కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌‌‌‌ నిశాంక్‌ అన్నారు. కనీస శిక్షణతో గ్రామీణ యువత కూడా ఉపయోగించగల ఈ పరికరం శక్తి వినియోగం కూడా చాలా తక్కువని ఆయన వెల్లడించారు. ఎక్కడికైనా తరలించేందుకు అనువుగా ఉండే ఈ పరికరం అనేక గ్రామీణ ప్రజల ప్రాణాలు నిలబెడుతుందని మంత్రి అన్నారు.

వైద్య విభాగం వైరాలజీ చరిత్రలోనే ఇదో గొప్ప ముందడుగని.. ఈ విధానాన్ని ప్రస్తుతం వాడుతున్న పీసీఆర్‌ ఆధారిత పరీక్షా విధానంతో మార్పుచేయచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్‌  డైరక్టర్‌ వీకే తివారీ తెలిపారు. తమ కొవిరాప్‌ పరికరానికి పేటెంట్‌ హక్కులను పొందిన అనంతరం భారీ ఎత్తున తయారీ సాధ్యమౌతుందన్నారు. ఇందుకుగాను తాము వివిధ సంస్థలతో చేతులు కలిపేందుకు సిద్ధమని ఆయన తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని