తేజస్‌ రైలు వస్తోంది.. ఏర్పాట్లివే..!

పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

Updated : 07 Oct 2020 16:15 IST

మళ్లీ పట్టాలెక్కనున్న తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లు..

దిల్లీ: దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్టు సంస్థ తెలిపింది. లఖ్‌నవూ-దిల్లీ, అహ్మదాబాద్‌-ముంబయిల మధ్య తేజస్‌ రైళ్లు అక్టోబర్‌ 17 నుంచి నడవనున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.

దేశంలో తొలి ప్రైవేట్ రైళ్లు అయిన తేజస్‌ సర్వీసులను తొలిసారిగా అక్టోబర్‌ 2019లో లఖ్‌నవూ, దిల్లీ మధ్య.. అనంతరం ఈ సంవత్సరం జనవరిలో అహ్మదాబాద్‌, ముంబయి మధ్య ప్రారంభించారు. వారణాసి ఇండోర్‌ల మధ్య నడిచే కాశీ మహాకాల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఫిబ్రవరిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వీటి సేవలు మార్చి 19 నుంచి నిలిచిపోయాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు వీటిలో అవసరమైన మార్పులు చేశారు.

*ప్రయాణం ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ తప్పనిసరి.
*ప్రతి ఒక్క ప్రయాణికుడికీ శానిటైజర్‌ బాటిల్‌, మాస్క్‌, ఫేస్‌ షీల్డ్‌, గ్లౌజులు కలిగి ఉండే కొవిడ్‌-19 రక్షణ కిట్‌ అందజేస్తారు.
*బోగీలతో పాటు పాంట్రీ, టాయిలెట్లను కూడా తరచుగా క్రిమి రహితం చేస్తారు.
*ఇక భోజనాన్ని అందించే ట్రేలు, ట్రాలీలు కూడా శానిటైజేషన్‌ అనంతరం మాత్రమే వాడతారు.
*ప్రయాణికుల సామాను, వస్తువులను క్రిమిరహితం చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు.
*ప్రతి రెండో సీటు ఖాళీగా ఉంటుంది.
*ప్రయాణికులు వారికి  కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి.. సీట్లు మారడాన్ని అనుమతించరు.
*ప్రయాణికులు, సిబ్బంది అందరూ మాస్కులు ధరించటం, కొవిడ్‌ నిబంధనలు పాటించటం తప్పనిసరి.
*ప్రయాణికులందరూ తమ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను కలిగి ఉండాలి. అవసరమైనపుడు దానిని తనిఖీ సిబ్బందికి చూపించాలి.

ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక యాజమాన్య విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏర్పాట్లన్నీ పక్కగా ఉంటాయని.. ఈ మేరకు తమ సిబ్బందికి పూర్తి శిక్షణనిచ్చామని అధికారులు తెలిపారు. టికెట్లను బుక్‌ చేసుకునే సమయంలో కూడా ప్రయాణికులకు పూర్తి వివరాలను తెలియజేస్తామని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని