కొవిడ్‌ వ్యర్థాలు: నాలుగు నెలల్లో 18వేల టన్నులు..!

గత నాలుగు నెలల్లోనే 18వేల టన్నుల బయోమెడికల్‌ వ్యర్థ్యాలు సేకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ప్రకటించింది.

Published : 12 Oct 2020 22:07 IST

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో వైరస్‌ నియంత్రణ, టెస్టులు, చికిత్సలో భాగంగా బయోమెడికల్‌ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మాస్కులు, పీపీఈ కిట్ల వాడకం తప్పనిసరైంది. దీంతో వీటిని వాడి పారేయడం వల్ల వ్యర్థాల పరిమాణం కూడా ఎక్కువైంది. కేవలం గత నాలుగు నెలల్లోనే 18వేల టన్నుల బయోమెడికల్‌ వ్యర్థ్యాలు సేకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ప్రకటించింది. వీటిలో మహారాష్ట్ర నుంచే అత్యధిక వ్యర్థాలు ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ వాడిపారేసే మాస్కులు, పీపీఈ కిట్ల వాడకం పెరిగింది. అంతేకాకుండా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలోనూ వీటికి సంబంధించిన వస్తువుల‌ వినియోగం భారీగా పెరిగింది. ఇలా, కేవలం గడిచిన నాలుగు నెల్లోనే దేశవ్యాప్తంగా 18,006 టన్నుల వ్యర్థాలు సేకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) వెల్లడించింది. ఇందులో ఒక్క సెప్టెంబర్‌ మాసంలోనే గరిష్ఠంగా 5500టన్నుల వ్యర్థాలు సేకరించినట్లు పీసీబీ తెలిపింది. దేశవ్యాప్తంగా బయోమెడికల్‌ వ్యర్థాలు అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నట్లు పీసీబీ పేర్కొంది. మహారాష్ట్రలో 3587 టన్నులు, తమిళనాడులో 1737 టన్నులు, గుజరాత్‌ 1638 టన్నులు, కేరళలో 1516టన్నులు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1432టన్నులు, దిల్లీలో 1400టన్నులు, కర్ణాటకలో 1380టన్నులు, పశ్చిమ బెంగాల్‌లో వెయ్యిటన్నుల బయోమెడికల్‌ వ్యర్థాలను సేకరించినట్లు పీసీబీ వెల్లడించింది. జూన్‌ నెల నుంచి ఇప్పటివరకు బయోమెడికల్‌ వ్యర్థాలపై అన్ని రాష్ట్రాల నుంచి సీపీసీబీ సమాచారాన్ని సేకరించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 198 కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌(CBWTFs) కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ వ్యర్థాలను సేకరించి, శుద్ధిచేసి పారవేస్తోంది. బయోమెడికల్‌ వ్యర్థాల్లో ముఖ్యంగా పీపీఈ కిట్లు, మాస్కులు, షూ కవర్లు, గ్లౌజులు, టిష్యూ, కాటన్‌ స్వాబ్‌లు, సూదులు, సిరంజీల వంటి వ్యర్థాలు ఉన్నాయి. అయితే, కరోనా వైరస్‌ పరీక్షలు, చికిత్సలో తర్వాత వచ్చే బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ కోసం సీపీసీబీ గత మార్చి నెలలోనే మార్గదర్శకాలు జారీచేసింది. ఈ వ్యర్థాల పర్యవేక్షణ కోసం కొవిడ్‌19BWM పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా తయారుచేసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని