
ట్రంప్ కోసం భారతీయ అమెరికన్లు
ఆస్పత్రి బయట ప్రార్థనలు, పూజల నిర్వహణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాల క్షేమం కోసం ఆ దేశంలోని భారతీయ అమెరికన్లు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రంప్ దంపతులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి బయట స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం భారీ సంఖ్యలో వేచిచూశారు. ‘సెంటినల్స్ ఆఫ్ ధర్మా’ అనే హిందూ అమెరికన్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ట్రంప్‌కు కరోనా వైరస్ నయం కావాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం ఆయన తరఫున దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తామని కూడా వారు తెలిపారు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో కూడా ట్రంప్‌కు మద్దతుగా భారతీయులు పలు వర్చువల్ ప్రదర్శనలు చేపట్టారు. వీరందరికీ కాలిఫోర్నియాలోని డిస్టిక్ట్ 11 అభ్యర్థి నిశా శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్న ట్రంప్ ఈ ఉదయం తన మద్దతుదారులకు కనిపించేందుకు కాసేపు బయటకు వచ్చారు. ఆస్పత్రి బయట వేచిచూస్తున్న అభిమానులకు ఆయన అభివాదం చేశారు. తన ప్రత్యేక వాహనంలోనే ఆస్పత్రి ఆవరణలో కాసేపు చక్కర్లు కొట్టారు. తాను బాగానే ఉన్నానంటూ సైగల ద్వారా వారికి తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు నేడు వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావచ్చనే కథనాలు వెలువడుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.