బాబోయ్‌.. ఈ అమ్మాయి జుట్టు ఎంత పొడుగో! 

అమ్మాయిలకు జుట్టే అందం.. పొడుగు జడ ఉండే అమ్మాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కురులు పెరగడం మాట అటుంచితే ఉన్న జుట్టు రాలిపోతున్న నేటి కాలంలో పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిలు చాలా అరుదుగా...........

Updated : 08 Nov 2020 10:42 IST

తన రికార్డును తానే తిరగరాసిన గుజరాత్‌ అమ్మాయి

ఇంటర్నెట్ డెస్క్‌: అమ్మాయిలకు జుట్టే అందం.. పొడుగు జడ ఉండే అమ్మాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కురులు పెరగడం మాట అటుంచితే ఉన్న జుట్టు రాలిపోతున్న నేటి కాలంలో పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిలు చాలా అరుదుగా కనబడుతుంటారు. అయితే, భారత్‌కు చెందిన నీలాన్షి పటేల్‌ పొడుగైన జుట్టు కలిగిన టీనేజర్‌గా గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో మరోసారి చోటు దక్కించుకున్నారు. 2018 నవంబర్‌ 21న తనపేరిట నమోదైన రికార్డునే ఈ ఏడాది కూడా తిరగరాశారు. గుజరాత్‌కు చెందిన నీలాన్షి జుట్టు పొడవు 2018లో 170.5 సెం.మీల ఉండగా.. 2019 సెప్టెంబర్‌లో 190 సెం.మీలుగా ఉంది. ఈ ఏడాది జుట్టు పొడవు 200 సెం.మీలకు పెరిగింది. 

తన 18వ పుట్టిన రోజుకు ముందే నీలాన్షి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆగస్టు నాటికి ఆమెకు 18 ఏళ్లు నిండటంతో ఇకపై పొడవైన జట్టు కలిగిన టీనేజర్‌గా పోటీకి ఆమె అనర్హురాలు కానున్నారు. కానీ మరో వ్యక్తి ఎవరైనా ఈ రికార్డును తిరగ రాసేవరకు ఈ రికార్డు ఆమె పేరుతోనే కొనసాగనుంది. గిన్నిస్‌ రికార్డుకు ఎంపిక కోసం జుట్టును తడిగా ఉన్నప్పుడే కొలుస్తారు. జుట్టు పొడిగా ఉంటే ఒంపులు తిరిగే అవకాశం ఉండటంతో కచ్చితమైన కొలతలు రావు. అందువల్ల తడి జుట్టునే ఏదైనా బల్ల పైనో, నేలమీదో నిటారుగా ఉంచి స్కేల్‌తో నిడివిని కొలుస్తారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు పోస్ట్‌ చేశారు.

ఆ అనుభవమే జుట్టు పెంచేలా చేసింది!
నీలాన్షి పటేల్‌ జుట్టు పెంచడానికి కారణం లేకపోలేదు. చిన్న వయస్సులో ఓ సెలూన్‌కు వెళ్తే అక్కడ సరిగా జుట్టును కత్తిరించకపోవడంతో అప్పట్నుంచే కత్తిరించుకోకూడదని నిర్ణయించుకున్నారట. అప్పటి నుంచి తన కురులను అలాగే పెంచుతున్నట్టు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు ఆమె తెలిపారు. అయితే, ఈ నిర్ణయానికి ఆమె తల్లి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు ప్రతివారం తల స్నానం చేశాక జుట్టు ఆరబెట్టడం, దువ్వడం వంటి వాటిలో సాయం చేస్తుంటారు. పొడవైన జుట్టు కలిగిన టీనేజర్‌గా ప్రపంచ రికార్డులో చోటుదక్కడంపై నీలాన్షి ఆనందం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని