సంస్కృతంలో ప్రమాణస్వీకారం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ గౌరవ్‌శర్మ ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

Published : 25 Nov 2020 23:44 IST

న్యూజిలాండ్‌లో ఎంపీగా భారత సంతతి వైద్యుడు

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ గౌరవ్‌శర్మ ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ మేరకు బుధవారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. గౌరవ్‌శర్మ మొదట న్యూజిలాండ్‌ అధికారిక భాష అయిన మావోరీలో, తర్వాత సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. దీంతో అందరూ గౌరవ్‌ రెండు దేశాలకు, వాటి భాషలకు సరైన గౌరవాన్నిచ్చారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై గౌరవ్‌ స్పందించారు. ‘‘ మొదట నేను నా మాతృభాష అయిన పహరి లేదా పంజాబీలో ప్రమాణస్వీకారం చేద్దాం అనుకున్నా. కానీ అందరినీ ఎలా సంతోషపరచగలను అన్న ఆలోచన వచ్చింది. దీంతో సంస్కృతాన్ని ఎంచుకున్నాను. దీని ద్వారా అన్ని భారతీయ భాషలకు గౌరవం అందించినట్లని నాకు అనిపించింది.’’ అని ట్విటర్‌లో ఆయన తెలిపారు.  వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన గౌరవ్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తరపున పోటీ చేశారు. హామిల్టన్‌ వెస్ట్‌ ప్రాంతం నుంచి 4,386 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  2017లో కూడా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.  వారు 1996లో భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డారు.  తాను సమాజానికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వెళ్లానని ఆయన తెలిపారు. వారి కుటుంబం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా న్యూజిలాండ్‌లో ఉన్న సామాజిక భద్రతే వారిని రక్షించిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని