తొలి లక్ష@110రోజులు.. 9 లక్షలు@59 రోజులే

రతావనిపై కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా తొలి రోజుల్లో లక్ష కేసులు నమోదైతేనే వామ్మో అన్నాం. ఇప్పుడు వైరస్‌ విలయతాండవం

Updated : 17 Jul 2020 17:12 IST

దిల్లీ : భారతావనిపై కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా తొలి రోజుల్లో లక్ష కేసులు నమోదైతేనే వామ్మో అన్నాం. ఇప్పుడు వైరస్‌ విలయతాండవం చేస్తూ ఆ సంఖ్య పది లక్షలను దాటింది. గడిచిన కొన్ని రోజుల్లో నిత్యం 30 వేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

తొలి లక్షకు 110 రోజులు
లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లక్ష కేసులు నమోదుకావడానికి పట్టిన సమయం 110 రోజులు. మే 19న దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ తర్వాత కేవలం 59 రోజుల్లోనే 9 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదవడం గమనార్హం.

మిలియన్‌ కేసులు దాటిన మూడో దేశం..
ప్రపంచంలో పది లక్షల కేసులు నమోదైన మూడో దేశంగా భారత్‌ నిలిచింది. ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్‌లోనే కేసుల సంఖ్య పదిలక్షలు దాటింది. ఇప్పుడు భారత్‌ ఆ వరుస క్రమంలో మూడోస్థానానికి చేరింది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 34,956 పాజిటివ్‌ కేసులు, 687 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో శుక్రవారంనాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ఊరటనిస్తున్న రికవరీ రేటు
దేశంలో కేసుల సంఖ్య  పెరుగుతున్నప్పటికీ.. రికవరీ శాతం ఎక్కువగా ఉండటం ఊరటకలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,942 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఒక్క రోజులో ఇంత మంది కోలుకోవడం ఇదే తొలిసారి. జూన్‌ నెల మధ్యలో 50శాతంగా ఉన్న రికవరీ రేటు జులైనాటికి 63శాతానికి పెరిగింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకోగా మరో 3,42,473 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  ఇక మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని