‘బాబా కా ధాబా’ టు ‘రెస్టారంట్‌ కా బాబా’!

 ‘బాబా కా ధాబా’ ఇటీవల దిల్లీ సహా సామాజిక మాధ్యమాల్లో దేశమంతటా బాగా ప్రఖ్యాతి గాంచిన పేరు అది. ఆ ధాబాకు చెందిన వృద్ధ దంపతులు ప్రస్తుతం ఓ రెస్టరెంట్‌కు యజమానులు కావడం విశేషం. 

Published : 22 Dec 2020 02:07 IST

దిల్లీ: ‘బాబా కా ధాబా’ ఇటీవల దిల్లీ సహా దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రఖ్యాతి గాంచిన పేరు. ఆ ధాబాకు చెందిన వృద్ధ దంపతులు ప్రస్తుతం ఓ రెస్టారంట్‌‌కు యజమానులు కావడం విశేషం. నెటిజన్లు చేసిన విరాళాల సాయంతో ప్రస్తుతం కాంత ప్రసాద్‌(80) దంపతులు ఓ హోటల్‌కు యజమానులయ్యారు. తాజాగా దిల్లీలోని మాలవీయ నగర్‌లో వారు నూతన రెస్టారంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతప్రసాద్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మాకు సహాయం చేసిన ప్రజలకు మేం రుణపడి ఉంటాం. మా హోటల్‌కు రావాలని ప్రజల్ని కోరుతున్నాం. ఇక్కడ దేశీ ఆహారంతో పాటు చైనీస్‌ ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి’ అని తెలిపారు. 

‘బాబా కా ధాబా’ పేరుతో దిల్లీకి చెందిన వృద్ధ దంపతుల కష్టాలపై గౌరవ్‌ వసన్‌ అనే వ్యక్తి పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన కష్టాలపై ఆ వీడియోలో కాంత ప్రసాద్‌ ఏడ్చిన తీరు అందరినీ కలచి వేసింది. దీంతో ఎంతో మంది నెటిజన్లు విరాళాల రూపంలో ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన విరాళాలతో తన కష్టాలు తీరిపోతాయని కాంత ప్రసాద్‌ భావిస్తుండగా.. మరో వివాదం తెరమీదకు వచ్చింది. తన పేరుపై వచ్చిన విరాళాల్ని ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు బెదిరించిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. 

ఇదీ చదవండి

‘దిగులు పడొద్దు బాబా.. మేమున్నాం’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని