దేవరగట్టు కర్రల సమరంపై నిషేధం

కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా జరిగే కర్రల సమరాన్ని(బన్ని ఉత్సవం) కరోనా నేపథ్యంలో ఈ సారి నిషేధించారు. దేవరగట్టుకు

Published : 26 Oct 2020 12:15 IST

దేవరగట్టు: కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా జరిగే కర్రల సమరాన్ని(బన్ని ఉత్సవం) కరోనా నేపథ్యంలో ఈ సారి నిషేధించారు. దేవరగట్టుకు వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఇవాళ రాత్రి జరిగే ఉత్సవాలకు బయటివారిని ఎవరినీ అనుమతించకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా సందర్భంగా కర్రల సమరాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. జైత్రయాత్రగా బయలుదేరే ఇలవేల్పు మాళమ్మ, మల్లేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను చేజిక్కించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పరం దాడి చేసుకుంటారు. దీన్నే ‘బన్ని’ ఉత్సవం అంటారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళ్లువాయి, ఎళ్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామస్థులు మరో జట్టుగా తలపడతారు. ఈ సమరంలో హింస చోటు చేసుకుంటుంది. ఎంతో మంది తలలు పగులుతాయి. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు.

ఉత్సవం రద్దుపై స్థానికుల అసంతృప్తి

అయితే, వేలాదిమంది పాల్గొనే ఈ ఉత్సవం ద్వారా కరోనా వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉన్నందున ఈ ఏడాది కర్రల సమరాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసకు దారితీసే కర్రల సమరాన్ని అరికట్టేందుకు అధికారులు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలను ఇవ్వలేదు. కరోనా దెబ్బకు ఈ సంప్రదాయానికి అడ్డుకట్టపడినట్లయింది. కాగా, అనాదిగా వస్తున్న బన్ని ఉత్సవాన్ని రద్దు చేయడంపై స్థానికులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

దేవరగట్టులో 50 సీసీ కెమెరాలతో నిఘా
ఉత్సవాలు నిషేధం నేపథ్యంలో ఆలూరు, హొళగుంద మండలాల్లో ఈనెల 25, 26వ తేదీల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించినట్లు సీఐ భాస్కర్‌ స్పష్టం చేశారు. రెండు రోజులపాటు ఎవరూ దుకాణాలు తెరవకూడదని, రహదారులపై తిరగకూడదన్నారు. బన్ని ఉత్సవాల నిషేధం నేపథ్యంలో ఏడుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 73 మంది ఎస్సైలతోపాటు వేయి మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇతర ప్రాంతాల ప్రజలు దేవరగట్టుకు వెళ్లకుండా 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గట్టు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎస్సైతో పాటు పోలీసులు గస్తీ నిర్వహిస్తారని పేర్కొన్నారు. దేవరగట్టులో 50 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాల్లోని గ్రామాల్లో 10 నుంచి 25 మంది పేర్లను తీసుకున్నామని, పేర్లు నమోదు చేసుకున్నవారు మాత్రమే గట్టుకు వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అందరూ సహకరించాలని ఆయన కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని