
ఓటు బాధ్యతనుకున్నారు.. వంతెన నిర్మించుకున్నారు!
పట్నా: బిహార్‌లో ఎన్నికల వేళ ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఓటింగ్‌పై తమ బాధ్యతను చాటుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వాగు ఆటంకిగా మారడంతో ఏకంగా వంతెననే నిర్మించి ఆశ్చర్యపరిచారు. మొదటి దశ ముందు రోజున నిర్మాణం ప్రారంభించి మూడో దశ ఎన్నికలకు ఒక్కరోజు ముందే పూర్తి చేసి.. వంతెనపై వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా ఈ వంతెనకు సంబంధించిన విషయాల్ని స్థానికుడు పర్వేజ్ ఆలం అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు. ‘ఎన్నో ఏళ్లుగా ఈ వాగు దాటడానికి కష్టాలు పడుతున్నాం. ఇప్పటి వరకు ఎవరూ కనీసం వంతెన నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రం వాగు అవతలివైపు ఉండటంతో ప్రజలు సులభంగా వెళ్లడానికి ఈ మార్గం ఆలోచించాం. దీంతో ప్రజలు గరిష్ఠ సంఖ్యలో వంతెనపై నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ వంతెన నిర్మాణం మొదటి దశ ఎన్నికలకు ఒకరోజు ముందు(అక్టోబర్ 27)న ప్రారంభించాం. అది కాస్తా తమ ప్రాంత ఎన్నికలకు ఒకరోజు ముందు నవంబర్ 6న పూర్తయింది’ ఆలం తెలిపారు. ఈ వంతెన లేకపోతే ప్రజలు పడవలను ఉపయోగించుకుని వాగు దాటాల్సి వచ్చేదని చెప్పారు.
బిహార్‌లో శనివారం మూడో దశ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 42శాతం నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. తుది దశలో మొత్తం 16 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.