తప్పిపోయిన పోలీసు.. దీనావస్థలో

అది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణం. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వెళుతున్నారు. అయితే దీనావస్థలో ఉన్న ఓ వ్యక్తి చలిలో వణుకుతూ...

Published : 16 Nov 2020 01:08 IST

15 ఏళ్ల కిందటి అధికారుల పేర్లు చెప్పడంతో గుర్తింపు

గ్వాలియర్‌: అది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పట్టణం. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో వెళుతున్నారు. అయితే దీనావస్థలో ఉన్న ఓ వ్యక్తి చలిలో వణుకుతూ ఫుట్‌పాత్‌ వెంట ఆహారం కోసం వెతుకుతుండటాన్ని వారు గమనించారు. చలించిన అధికారులు అతడి వద్దకు వెళ్లి ఓ జాకెట్‌ను అందించగా సదరు వ్యక్తి పోలీసు అధికారుల పేర్లు చెప్పడంతో వారు కంగుతిన్నారు. అయితే అతడు 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ సహచర అధికారే అని తెలిసి ఆశ్చర్యపోయారు.

డిప్యూటీ సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న రత్నేష్‌సింగ్‌ తోమర్‌, విజయ్‌సింగ్‌ బహదూర్‌ గ్వాలియర్‌లో మంగళవారం రాత్రి ఓ వివాహానికి వెళుతుండగా వారికి ఈ ఆశ్చర్యకర ఘటన ఎదురైంది. యాచకుడిలా కనిపించిన సదరు వ్యక్తిని నిశితంగా పరిశీలించిన అధికారులు అతడిని తమ సహచరుడు మనీశ్‌ మిశ్రాగా గుర్తించారు. గ్వాలియర్‌ క్రైం బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేస్తున్న రత్నేష్‌సింగ్‌ తోమర్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మనీశ్‌ మిశ్రా మానసిక సమస్యలతో బాధపడేవాడని, 2005లో దతియాలో ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్‌ వచ్చిన అనంతరం ఆయన కనిపించకుండా పోయాడని తోమర్‌ పేర్కొన్నారు. ఈ 15 ఏళ్లలో మనీశ్‌ జాడ తెలియరాలేదన్నారు. 

మనీశ్‌ని ప్రస్తుతం ఓ ఎన్‌జీఓ ఆశ్రమంలో చేర్పించామని తెలిపారు. ‘మిశ్రా మాతోపాటే 1999లో పోలీసు ఉద్యోగంలో చేరాడు. అతడో మంచి అథ్లెట్‌. షార్ప్‌ షూటర్‌. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలం తర్వాత మానసిక సమస్యలతో బాధపడ్డాడు. అతడి కుటుంబం వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు’ అని తోమర్‌ వివరించారు. అతడికి ఉత్తమ వైద్యం అందించి తిరిగి మామూలు మనిషిగా మార్చేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని