Published : 19/10/2020 02:12 IST

87 ఏళ్ల వైద్యుడు.. ఎందరికో ఆదర్శప్రాయుడు!

కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం తీవ్రంగా ఉందని వైద్యనిపుణులు చెబుతుండటంతో వారంతా హడలెత్తిపోతున్నారు. కనీసం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మహమ్మారి బారిన పడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కొన్ని చోట్ల వైద్యం చేసేందుకు డాక్టర్లు సైతం వెనకాడుతుండటం పరిస్థితిని తెలియజేస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మహారాష్ట్రకు చెందిన 87 ఏళ్ల ఓ డాక్టర్‌ గతంలో వలే పేదలకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనాకు భయపడకుండా కష్టకాలంలో ప్రజల రోగాలను నయం చేస్తూ వైద్యో నారాయణో హరి అనే సూక్తికి నిలువుటద్దంలా నిలిచారు.

మహారాష్ట్రకు చెందిన రామచంద్ర దండేకర్‌ బల్లార్షా ప్రాంత ప్రజల దేవుడిగా మారారు. గత 60 సంవత్సరాలుగా రోజుకు 10 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణిస్తూ వారికి వైద్యం చేస్తున్నారు. రోగుల ఇళ్లకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. వారి నుంచి ఆశించేది కూడా పెద్దగా ఏం లేదు. తాజా విపత్కర పరిస్థితులతో  ప్రతి ఒక్కరూ భయాందోళనలకు గురవుతున్నా.. రామచంద్ర మాత్రం తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. రోగులకు ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం చేస్తూ మనసులు చూరగొంటున్నారు ‘‘ కరోనాకు ముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నా శక్తి కొద్దీ వైద్యం చేస్తూ పేదలకు సహాయపడాలనుకుంటున్నాను. భవిష్యత్‌లోనూ దీనిని కొనసాగిస్తాను’’ అని రామచంద్ర చెప్పడం ఆయనలోని ఆత్మవిశ్వాన్ని తెలియజేస్తోంది.

లెక్చరర్‌గా పని చేస్తూ..

రామచంద్ర దండేకర్‌ 1957-58లో నాగపూర్ కాలేజ్‌ ఆఫ్‌ హోమియోపతిలో డిప్లమా పూర్తి చేశారు. ఆ తర్వాత చంద్రాపూర్‌ హోమియోపతి కళాశాలలో లెక్చరర్‌గా ఏడాదిపాటు పని చేశారు. అప్పుడే ప్రజలకు సేవ చేయాలనే కోరిక కలిగింది. ఓ వైపు లెక్చరర్‌గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు సమీపంలోని ఏడు గ్రామాల ప్రజలకు వైద్యం చేయడం ప్రారంభించాడు. నాటి నుంచి అది అప్రతిహతంగా కొనసాగుతోంది. వైద్యం చేయడానికి వెళ్లేటప్పుడు ఇప్పుడైనా కనీసం ఒక మొబైల్‌ కూడా తీసుకెళ్లరు. మరీ దూరం వెళ్లాల్సి వచ్చినపుడు బస్సులో వెళ్లి, అక్కడ ఎవరిదైనా సైకిల్‌ తీసుకొని బాధితుల ఇళ్లకు వెళ్తారు. వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ధైర్యాన్ని నూరిపోస్తారట. ఇంటికి రావడం ఆలస్యమవుతుందనుకుంటే ఎవరో ఒకరింట్లో బస చేసి, ఉదయాన్నే తిరుగుపయనమవుతారు. అందరూ ఆయన్ని గౌరవంగా ‘డాక్టర్‌ సాహెబ్‌ ముల్‌వాలే’ అని పిలుచుకుంటారు.

వయోభారంతో..

కరోనా విషయాన్ని పక్కన పెడితే వయోభారం కారణంగా ఇంతకు ముందులా రామచంద్ర బయటకు వెళ్లలేకపోతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరైనా బాగోలేదని ఫోన్‌ చేస్తే.. దానికి అవసరమైన మందులను చెప్పడమో, లేదా సమీపంలోని ఫలానా ఆస్పత్రికి వెళ్లండని సూచించడమో చేస్తున్నారట. ఆయన పెద్ద కుమారుడు జయంత్‌ ఇప్పుడు కొంత సాయం చేస్తున్నాడు. వారంలో ఏయే ఊర్లు ఎప్పుడెప్పుడు వెళ్లాలా? అని నిర్ణయించి ఆయనే తీసుకెళ్తున్నారు. అయితే, తన జీవితం చరమాంకం వరకు వైద్య వృత్తిని వదలబోనని రామచంద్ర చెబుతుండటం, అందుకు తగ్గట్టుగా సేవలు కూడా అందిస్తుండం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని