పొగాకు ఉత్పత్తులకు కళ్లెం వేద్దాం!

పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులకు  కేంద్రం ప్రవర్తనా నియమావళి రూపొందించింది. పొగాకు పరిశ్రమలు తమ అధికారంతో ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడంతో పాటు.........

Updated : 21 Nov 2020 22:38 IST

అధికారులకు కేంద్రం సూచనలు

హైదరాబాద్‌: పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులకు  కేంద్రం ప్రవర్తనా నియమావళి రూపొందించింది. పొగాకు పరిశ్రమలు తమ అధికారంతో ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తీసుకొనే చర్యలకు ఆటంకాలు కలిగిస్తుంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలకు సహకరించకుండా కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ  ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది. డబ్ల్యూహెచ్‌వో పొగాకు నియంత్రణ ఆర్టికల్‌ 5.3కి అనుగుణంగా ఈ పరిశ్రమల వాణిజ్య ప్రయోజనాల నుంచి ప్రజారోగ్య విధానాలను పరిరక్షించడంలో భాగంగా కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక పొగాకు వినియోగదారులున్న మన దేశంలో దీని నియంత్రణకు ఎన్నో చట్టాలు రూపొందించినా.. వాటిలో కొన్ని మాత్రమే సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొంది. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లాల స్థాయిలో పొగాకు పరిశ్రమ ప్రవేశాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు పరిశ్రమలతో పరస్పర చర్యలను పరిమితం చేసేలా ఏర్పాట్లు చేయాలని సిఫారసు చేసింది.

జాతీయ చట్టానికి అనుగుణంగా పొగాకు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు ఆయా పరిశ్రమల వాణిజ్య, ఇతర స్వార్థ ప్రయోజనాల నుంచి రక్షించడానికి దోహదపడతాయని కేంద్రం సూచించింది. పొగాకు పరిశ్రమల ఉత్పత్తులను నియంత్రించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాలని, అవసరమైనంత వరకు మాత్రమే పొగాకు ఉత్పత్తులు ఉండేలా చూడాలని తెలిపింది. ఆరోగ్య విధానంలో పొగాకు పరిశ్రమ జోక్యాన్ని తొలగించడం ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత ప్రభావవంతమైన చర్య.. దీనిద్వారా ధూమపానం వల్ల సంభవించే మరణాలు, వ్యాధులను నివారించవచ్చంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) కొన్ని ప్రాంతాల్లో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఇంకా దాంట్లో అనేక అంశాలను సవరించాల్సి ఉందని అభిప్రాయపడింది. దీనిద్వారా పొగాకు వాడకంతో ముప్పు నుంచి దేశ జనాభాను మరింత సమర్థంగా కాపాడేందుకు దోహదపడుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని