మద్యం సీసాల అంశం..వరలక్ష్మి రాజీనామా

కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా...

Updated : 01 Oct 2020 22:20 IST

విజయవాడ: కారులో మద్యం సీసాలు దొరికిన అంశం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు నాగ వరలక్ష్మి రాజీనామాకు దారి తీసింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, ఈవోలకు నాగ వరలక్ష్మి రాజీనామా లేఖ పంపారు. తనకు తెలియకుండా కారు డ్రైవర్‌ మద్యం బాటిళ్లు తరలించినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్‌ కూడా ఇప్పటికే తన తప్పును ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్‌ ఉదయభానుతోపాటు దేవాదాయశాఖ మంత్రికి కూడా తెలియజేశానన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాను ధర్మకర్తల మండలి సభ్యురాలిగా రాజీనామా చేస్తున్నట్లు నాగ వరలక్ష్మి తన లేఖలో స్పష్టం చేశారు.

పాలక మండలి సభ్యురాలు నాగవరలక్ష్మి వాహనంలో తెలంగాణ మద్యం లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. వైకాపా కార్యకర్త అయిన ఆమె భర్త వెంకట కృష్ణప్రసాద్‌, కారు డ్రైవర్‌ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని ప్రసాద్‌ వాహనంపై బోర్డు తగిలించి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం ధరలు భారీగా పెరిగిన తర్వాత తెలంగాణ సరకు విచ్చలవిడిగా వస్తోంది. పలువురు దీన్నే వ్యాపారంగా చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో మండలానికొక నాయకుడు మద్యం వ్యాపారం చేసుకుంటున్నారు. వారు మినహా ఇతరులు మద్యం రవాణా చేస్తే పోలీసులకు సమాచారం వెళుతుందని ప్రచారం వైకాపాలోనే ఉంది. దుర్గగుడిలో ఇటీవల వెండి సింహాల చోరీ ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ఈ వివాదం తెరమీదకు వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని