ఆ వీడియో కాల్‌ ఎవరికి?

విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్‌ను కొడుతూ, శిరోముండనం చేయించేటప్పుడు అక్కడున్న మహిళల్లో ఒకరు ఎవరికో వీడియో కాల్‌ చేశారు.

Updated : 31 Aug 2020 08:50 IST

శ్రీకాంత్‌ను కొడుతుండగా కాల్‌ చేసిన మహిళ
ఆధారాలు సేకరించిన పోలీసులు

విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ), న్యూస్‌టుడే: విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్‌ను కొడుతూ, శిరోముండనం చేయించేటప్పుడు అక్కడున్న మహిళల్లో ఒకరు ఎవరికో వీడియో కాల్‌ చేశారు. ఆ విషయాన్ని పోలీసులు నూతన్‌నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజిలో గమనించారు. ఈ కాల్‌ ఎవరికి చేశారు, ఆ దృశ్యాలను ఎవరికి చూపించారనే అంశాన్ని తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు. దాంతోపాటు.. ఈ కేసులో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కీలకంగా మారిన సీసీటీవీ కెమెరా ఫుటేజి సంపాదించడంలో విశాఖ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు నూతన్‌నాయుడి ఇంట్లోనే ఉంటూ ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో బాధితుడు శ్రీకాంత్‌ జరిగిన విషయాన్ని మీడియాకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఈ విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసుస్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ వెంటనే ఉన్నతాధికారులకు తెలిపాడు. పోలీసు అధికారులు ఈ విషయాన్ని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఏసీపీ (ఎస్సీ, ఎస్టీ సెల్‌) త్రినాథ్‌, వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్‌లను అప్రమత్తం చేశారు. అదేరోజు సాయంత్రం 6.30కు ఏసీపీలు ఇద్దరూ పెందుర్తి స్టేషన్‌కు వచ్చి శ్రీకాంత్‌ను కలిసి వివరాలు తెలుసుకుని వెంటనే నూతన్‌నాయుడి ఇంటికి వెళ్లారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉండటం గమనించి ఫుటేజి సేకరించారు. చుట్టుపక్కల వారినీ ప్రశ్నించారు. శ్రీకాంత్‌ కేకలు విన్నామని.. గుండు కొట్టించి బయటకు తీసుకొచ్చారని వారు చెప్పారు. నిందితుల్లో ముగ్గురిని రాత్రే స్టేషన్‌కు తరలించగా, శనివారం ఉదయం 6 గంటలకు నలుగురు మహిళలను తీసుకొచ్చారు. ఉదయం కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని