ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీలో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు పర్యావరణ ...

Published : 09 Sep 2020 17:26 IST

దిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవంటూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారని ఎన్జీటీ నిర్ధారించింది. ఈ మూడు ఎత్తిపోతల పథకాలు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదన్న కేంద్ర జలశక్తి శాఖ నివేదికతో ఎన్జీటీ ఏకీభవించింది. ఈ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ముందుకెళ్లొద్దని స్పష్టం చేసింది. 

మిగిలిన రెండు ఇప్పటికే నిర్వహణలో ఉన్నందున పర్యావరణ అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టినందుకు గాను జరిమానా, పరిహారం అంచనాపై కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిహారం, జరిమానాను అంచనా వేసి ఆరు నెలల్లో వసూలు చేయాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని