మరింత వేగంతో రైళ్లు.. అన్నీ ఏసీ కోచ్‌లు!

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత ఆధునికరించేందుకు భారత రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలోభాగంగా అత్యధిక వేగంతో (గంటకు 130-160కి.మీ) వెళ్లే రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Published : 12 Oct 2020 01:05 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించేందుకు భారత రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా అత్యధిక వేగంతో (గంటకు 130-160కి.మీ) వెళ్లే రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇవి త్వరలోనే పట్టాలెక్కనున్నాయని.. అందుబాటు ధరల్లోనే టికెట్లు ఉంటాయని రైల్వేశాఖ పేర్కొంది. అంతేకానీ, సాధారణ మార్గాల్లో నడిచే అన్ని నాన్‌-ఏసీ కోచ్‌లను ఏసీ-కోచ్‌లుగా మార్చడం లేదని రైల్వేశాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్‌ స్పష్టంచేశారు.

ప్రస్తుతం చాలా మార్గాల్లో నడిచే మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం గంటకు 110కి.మీ వరకే పరిమితి ఉంది. ఇక స్వర్ణ చతుర్భుజి మార్గాల్లో నడిచే రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లను గంటకు 120కి.మీ వేగంతో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. తాజాగా ఇలాంటి రైళ్లను గంటకు 130నుంచి 160 కి.మీ వేగంతో పరిగెత్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇలాంటి రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లు మాత్రమే ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇంత వేగంతో రైలు వెళ్లాలంటే సాంకేతికంగా కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో రైళ్ల కోచ్‌లు, ట్రాక్‌లను కూడా ఆధునీకికరిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇలాంటి కోచ్‌లను కపూర్‌తలాలోని రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామని, రానున్న కొన్ని వారాల్లోనే ఇవి సిద్ధమవుతాయని పేర్కొంది. ఈ సంవత్సరంలో 100కోచ్‌లను సిద్ధం చేయాలని ప్రణాళికలో ఉండగా, ఇప్పటికే వాటిలో 83 కోచ్‌లను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది దాదాపు 200కోచ్‌లను తయారు చేస్తామని రైల్వేశాఖ పేర్కొంది.

అయితే, గంటకు 110కి.మీ వేగంతో నడిచే రైళ్లలో నాన్‌-ఏసీ కోచ్‌లను అలాగే ఉంచుతామని రైల్వేశాఖ స్పష్టంచేసింది. కేవలం గంటకు 130 నుంచి 160కి.మీ వేగంతో వెళ్లే రైళ్లలోనే పూర్తిస్థాయిలో ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. దీంతో అందుబాటు ఛార్జీలతోనే ప్రయాణికులు వేగంగా, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం చేయవచ్చని రైల్వేశాఖ అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని