23నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 15 Nov 2020 17:15 IST

సమీక్షలో వెల్లడించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభంపై వారితో సుదీర్ఘంగా సమీక్షించారు.

సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతుందని అన్నారు. భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని సంతృప్తి, హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్‌ ఇప్పటికే చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని.. మరో మూడు నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలను వంద శాతం అధిగమిస్తుందని దీమా వ్యక్తం చేశారు. సమస్యలన్నీ పూర్తిగా చక్కబడ్డాకే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని అనుకున్నారని.. ఇందుకోసం ఇంత కాలం వేచి ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభిస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చదిద్దిన అధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభినందించారు.

ఇదీ చదవండి..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని