Updated : 07 Sep 2020 19:56 IST

INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను మూట కట్టి కలెక్టరేట్‌కు పంపించే ఏర్పాటు చేశారు. 


పోస్టాఫీసులో ఖాతా తెరిచేందుకు సికింద్రాబాద్‌లోని ప్రధాన శాఖ ఎదుట భౌతిక దూరం పాటించకుండా బారులు తీరిన ప్రజలు. అంత అత్యవసరంగా బ్యాంకు ఖాతా ఎందుకు అని అనుమానం కలుగుతుందా..? గత వారం రోజులుగా సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పోస్టాఫీసులో బ్యాంకు ఖాతా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అవి పుకార్లని తపాలా సిబ్బంది చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. 


వీరంతా కరోనా అనుమానితులు కాదు.. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినవారు. శరీర ఉష్ణోగ్రత పరీక్షించిన అనంతరం వైద్యుల వద్దకు అనుమతిస్తున్నారు. దీంతో చికిత్స కోసం వచ్చినవారు మిలీనియం బ్లాక్‌ వద్ద శరీర ఉష్ణోగ్రత పరీక్షించుకునేందుకు వందలాదిగా బారులు తీరారు. 


భౌతిక దూరం పాటించకుండా నిల్చున్న వీరంతా రోజువారీ కూలీలు. గుంటూరులో లాడ్జి సెంటర్‌లో పని కోసం వేచి చూస్తూ ఇలా నిలబడ్డారు. కొవిడ్‌ భయంతో ఇంట్లో ఉంటే పస్తులేనని, తప్పనిసరై పనికి కోసం ఇలా రావాల్సి వస్తోందని వారు అన్నారు. 


ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు రాజమహేంద్రవరం మార్కండేయ ఘాట్‌లో బురదలో ఆటలాడుతున్న చిన్నారులు. అనంతరం గోదావరిలో స్నానాలు చేస్తున్నారు. వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నదిలో కొట్టుకుపోయే అవకాశముంది!


వరద ముంపులో చిక్కుకున్న దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌ నగరం. భారీ తుఫాను కారణంగా తహ్వా నది పొంగడంతో సమీపంలోని రహదారులు, ఇళ్లు నీట మునిగాయి. 


అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని సియెర్రా అడవుల్లో గత శుక్రవారం చెలరేగిన కార్చిచ్చు 45 వేల ఎకరాలకు వ్యాపించింది. మముత్ పూల్ రిజర్వాయర్‌ను చూసేందుకు వెళ్లిన 200 మంది సందర్శకులను సైన్యం హెలికాప్టర్‌ ద్వారా రక్షించింది.  షావర్ లేక్ పట్టణం సమీపంలో దగ్దమవుతున్న అడవిని చిత్రంలో చూడొచ్చు. 


కొవిడ్‌ కారణంగా ఇజ్రాయిల్‌లో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా చనిపోయారు. వారికి సంతాప సూచకంగా టెల్ అవీవ్‌లోని రాబిన్ స్క్వేర్ వద్ద సుమారు వెయ్యికిపైగా కుర్చీలను ఉంచారు. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ఆదివారం నుంచి దేశంలో రాత్రిపూట  కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 


దసరా వేడుకల కోసం కోల్‌కతాలో దుర్గాదేవి విగ్రహం తయారీలో నిమగ్నమైన కళాకారుడు. దసరాను పశ్చిమ్‌ బెంగాల్‌లో వైభవంగా జరుపుకొంటారు. 


వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కాలిఫోర్నియాలోని హంటింగ్టన్‌ బీచ్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు.


డాలస్‌ డౌన్‌టౌన్‌లో ఓ గోడపై బోథమ్ జీన్ చిత్రాన్ని గీస్తున్న చిత్రకారుడు. బోథమ్‌ను రెండేళ్ల క్రితం డాలస్ పోలీస్ మాజీ అధికారిణి అంబర్ గైగెర్ కాల్చి చంపారు. విధులు నిర్వర్తించి తీవ్ర అలసటతో ఇంటికి వచ్చిన గైగెర్ సెంట్రల్ డాలస్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది. అయితే, పొరపాటున తన ఫ్లాట్‌కు బదులుగా మరో అంతస్తులోని ఫ్లాట్‌కు వెళ్లింది. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న జీన్‌ను ప్రమాదకరమైన బందిపోటుగా భావించి కాల్పులు జరిపింది. ఇది జాత్యహంకార హత్యేనంటూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కోర్టు అంబర్ గైగెర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని