Updated : 08 Sep 2020 20:47 IST

INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

హైదరాబాద్‌లోని నాగోల్‌-రాయదుర్గం మధ్య మెట్రో రైలు సేవలు మంగళవారం పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ కారణంగా ప్రయాణికులు మెట్రో ఎక్కేందుకు ఆసక్తి చూపలేదు. అమీర్‌పేట నుంచి నాగోల్‌ వెళ్తున్న రైలులో ప్రయాణికులు లేక బోసిపోతున్న బోగీలో సెల్ఫీ దిగుతున్న యువకుడు. 


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మోరంపూడి కూడలిలో పైవంతెన నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ మార్గాని భరత్‌, కేంద్ర బృందంతో విచ్చేశారు. త్వరితగతిన వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతులు అందజేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో కూడలిలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శంషాబాద్‌లోని విమానాశ్రయంలో మంగళవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్ హాజరయ్యారు. మొక్కను నాటిన అనంతరం సెల్పీదిగుతున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది. 


ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే వీటిని ఆకాకర లేదా బోడ కాకర అని పిలుస్తారు. ఇవి శరీరంలోని చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కిలో రూ.150 ధరతో కొనుగోలు చేస్తున్న ప్రజలు. 


భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి కుంటల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ సరిగా లేక దుర్గంధం వ్యాపిస్తోంది. చందానగర్‌లో ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌ వినాయక విగ్రహాలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన దృశ్యం. 


కర్నూలు మార్కెట్‌కు మంగళవారం ఉల్లి రైతులు పోటెత్తారు. కొవిడ్‌ కారణంగా రైతులకు టోకెన్లు ఇచ్చి విడతలవారీగా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు ఒకరోజు ముందుగానే మార్కెట్‌కు రావడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. తెచ్చిన ఉల్లితో రైతులు రెండు రోజులు మార్కెట్‌లో ఉండాల్సి వస్తుంది. కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో రైతులు తాము తెచ్చిన ఉల్లి బస్తాలపైనే సేదతీరుతున్నారు. 


ఓ గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్‌ భరత్‌నగర్‌లో రైల్వే ట్రాక్‌ దాటుతూ మంగళవారం మృతిచెందాడు. ట్రాక్‌ దాటుతుండగా పట్టాల మధ్య కాలు ఇరుక్కుపోయి చనిపోయి ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా మృతదేహాన్ని పట్టాలపై నుంచి తొలగించేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టింది. అప్పటి వరకు మృతదేహం పట్టాలపైనే ఉంది. దీంతో భరత్‌నగర్‌ పైవంతెన మీదుగా వెళ్లే ప్రజలు మృతదేహాన్ని చూసేందుకు ఆగడంతో వంతెనపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వంతెనపై వాహనాలు ఆపినవారికి జరిమానా విధిస్తామని పోలీసులు ప్రకటించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్వల్ప లాఠీఛార్జీ చేయాల్పి వచ్చింది. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని