‘థార్‌’ అద్భుతం.. ట్వీట్‌కు మహీంద్రా రిప్లై!

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన మహీంద్ర థర్‌ కారుకు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫిదా అయ్యారట. తన తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లాతో కలిసి తొలిసారి థర్‌లో టెస్ట్‌డ్రైవ్‌కు వెళ్లిన అనుభవాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

Published : 05 Oct 2020 19:34 IST

ముంబయి: ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన మహీంద్రా థార్‌కు జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫిదా అయ్యారట. తన తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లాతో కలిసి తొలిసారి థార్‌లో టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్లిన అనుభవాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘నాన్నతో కలిసి మహీంద్రా థార్‌లో టెస్ట్‌ డ్రైవ్‌ చేశా. ఈ వాహనం చాలా అద్భుతంగా ఉంది. పర్వత, మంచు ప్రాంతాల్లో ఈ కారులో ప్రయాణించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మహీంద్రా బృందానికి అభినందనలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఒమర్‌ తమ సంస్థ ఉత్పత్తిపై ఇచ్చిన రివ్యూపై ఆ సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సైతం స్పందించారు. కారుపై ఒమర్‌ చేసిన ప్రశంసల్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మీ నుంచి వచ్చిన అభినందనలు అపారమైనవి. మీరు నడిపే కార్ల విషయంలో మీకు మంచి పట్టు ఉందని నాకు తెలుసు’అంటూ మహీంద్రా పేర్కొన్నారు. 

కాగా మహీంద్రా సంస్థ రెండో తరం బీఎస్6 థార్‌ మోడల్‌ కారును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. థార్‌ పాత మోడల్‌తో పోలిస్తే కొత్త దాంట్లో మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారు డీజిల్‌, పెట్రోల్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. పెట్రోల్‌ ఏఎక్స్‌ వేరియంట్ల ధరలు రూ.9.8 లక్షల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.11.9 లక్షల వరకు ఉన్నాయి. డీజిల్‌ ఏఎక్స్‌ వేరియంట్లు రూ.9.8 లక్షల నుంచి ప్రారంభమై రూ.12.2 లక్షల వరకు ఉన్నాయి. ఇది 130 బీహెచ్‌పీ సామర్థ్యంతో 300ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టచ్‌ స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థతో పాటు, మల్టీ ఫంక్షన్‌ స్టీరింగ్‌ వీల్‌, అలాయ్‌ వీల్స్‌ దీనికి అందిస్తున్నారు. భద్రతా సదుపాయాలు విషయానికొస్తే డ్యుయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, అధిక వేగంలో ఉన్నప్పుడు అప్రమత్తం చేసే వ్యవస్థ సదుపాయాల్ని థార్‌ కలిగి ఉంది.

ఇదీ చదవండి...

మార్కెట్లోకి మహీంద్రా కొత్త థార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని