
ఆ రెస్టారెంట్లో కొవిడ్ కర్రీ, మాస్క్ నాన్..
ఇంటర్నెట్ డెస్క్: కరోనాపై అప్రమత్తత కల్పించేందుకు పలువురు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. దీంతో తమ వ్యాపారాన్ని సైతం వృద్ధి చేసుకుంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పుర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. వేదిక్ రెస్టారెంట్ ప్రత్యేకంగా ‘కొవిడ్ కర్రీ’, ‘మాస్క్ నాన్’ను తయారు చేస్తోంది. మలాయ్ కోఫ్తాతో చేసే కూరలో కోఫ్తాను వైరస్ రూపంలో తయారు చేస్తున్నారు. నాన్లను మాస్కుల రూపంలో రూపొందించి విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ.. ‘వినియోగదారుల ఆరోగ్యం, రక్షణ మా ప్రథమ ప్రాధాన్యత. అన్ని రకాల పరిశుభ్రతలు పాటిస్తూ వంటకాలు తయారు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు వహించాం’ అని పేర్కొన్నారు. రెస్టారెంట్ సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కొవిడ్ కర్రీ, మాస్క్ నాన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పలువురు ఆ ఫొటోలను ట్యాగ్ చేస్తూ భారత్‌లోనే ఇలాంటివి సాధ్యమవుతాయంటూ సరదా వ్యాఖ్యలు జోడిస్తున్నారు.