రైల్వే చేదు నిజం.. కోటి మందికి సీటు దక్కలేదు!

దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న.....

Published : 02 Nov 2020 00:58 IST

దిల్లీ: దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండే టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావడమే ఇందుకు కారణం. ఈ విధంగా 2019-2020లో మొత్తం 84,61,204 ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డు (పీఎన్‌ఆర్‌) నంబర్లు కలిగిన 1.25 కోట్ల మంది ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. 2014-15లో 1,13,17,481 పీఎన్‌ఆర్‌ నంబర్లు రద్దు కాగా.. 2015-16లో 81,05,022; 2016-17లో 72,13,131; 2017-18లో 73,02,042; 2018-19లో 68,97,922 నంబర్లు రద్దయ్యాయని తేలింది. 2019-2020లో సగటు వెయిటింగ్‌ లిస్ట్‌ డ్రాప్‌ 8.9 శాతం ఉండగా.. రద్దీ సమయాల్లో ఇది 13.3 శాతంగా ఉంటోంది. ఆన్‌లైన్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి చార్ట్‌ రూపొందించిన తర్వాత ఆటోమేటిక్‌గా టికెట్‌ క్యాన్సిల్‌ అవుతుంది. అలా రద్దైన టికెట్ల తాలూకా మొత్తం ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతుంది. వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా పెరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్‌ సైతం వీకే యాదవ్‌ సైతం ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అంగీకరించారు. ఈ జాబితాను తగ్గించేందుకే ప్రైవేటు రైళ్లను, రద్దీ మార్గాల్లో క్లోన్‌ రైళ్లను తీసుకొస్తున్నట్లు చెప్పారు. క్లోన్‌ రైళ్లు తక్కువ స్టాపులతో, అసలైన రైలు కంటే ముందుగానే గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. వీటి టికెట్‌ ధర కూడా అధికంగా ఉంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు