ఆ కోతి ఆచూకీ చెప్తే రూ.50 వేలు!

సాధారణంగా కావాల్సిన వారెవరో కనిపించకుండా పోతే ఆచూకీ తెలిపిన వారికి రివార్డు లిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం చూసుంటాం. కానీ, ఓ కోతి ఆచూకీ చెప్తే డబ్బులిస్తామనటం ఎప్పుడైనా చూశారా? అదీ తక్కువేం కాదు..అక్షరాల రూ.50 వేలు. ఈ వ్యవహారం పంజాబ్‌లోని ఛండీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. మరి ఆ కోతికి అంత క్రేజ్‌ ఎందుకొచ్చిందో తెలుసా?..

Published : 27 Sep 2020 01:43 IST

ఛండీగఢ్‌: సాధారణంగా కావాల్సిన వారెవరో కనిపించకుండా పోతే ఆచూకీ తెలిపిన వారికి రివార్డు లిస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం చూసుంటాం. కానీ, ఓ కోతి ఆచూకీ చెప్తే డబ్బులిస్తామనటం ఎప్పుడైనా చూశారా? అదీ తక్కువేం కాదు..అక్షరాల రూ.50 వేలు. ఈ వ్యవహారం పంజాబ్‌లోని చండీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. మరి ఆ కోతికి అంత క్రేజ్‌ ఎందుకొచ్చిందో తెలుసా?

చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్‌ కమల్‌జీత్‌ సింగ్‌, ఆయన మేనేజర్‌ దీపక్‌ ఓహ్రా ఓ కోతిని పెంచుకునే వాళ్లు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను అక్రమంగా పెంచుకోవడం నేరం. దీంతో వారిద్దరినీ గత ఆగస్టు 19 పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత రోజే బెయిల్‌పై విడుదలయ్యారు. కోతిని పెంచుకోవడం వాస్తవమేనని అయితే అది చట్ట రీత్యా నేరమని తెలిసిన తర్వాత అడవిలో విడిచి పెట్టేశామని పోలీసులకు విచారణ సమయంలో చెప్పారు. అయితే వారు చెప్పేది నమ్మశక్యంగా లేదని ‘పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పీఈటీఏ) అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ లవ్‌జీందర్‌ కౌర్‌ సరైన ఆధారలతో నిరూపించాలని నిందితులకు సూచిస్తూ కేసును అక్టోబర్‌ 7కి వాయిదా వేశారు.

మరోవైపు విచారణ సమయంలో నిందితుల మాటల్లో స్పష్టత కొరవడిందని అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ అబ్దుల్‌ ఖయ్యూం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోతిని అడవిలో విడిచిపెట్టినట్లు వారు కచ్చితమైన ఆధారాలేవీ సమర్పించలేకపోయారన్నారు. అంతేకుండా కోతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఫిర్యాదు చేసిన ఎన్జీవో సంస్థ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. దాని ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ప్రకటించింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పింది. దీనిపై కమల్‌జీత్‌ సింగ్‌, దీపక్‌ వోహ్రా స్పందించారు ఈ ఘటనను ఎక్కువ చేసి చూపించేందుకు సదరు స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని