స్ఫూర్తిదాయక కథలతో మానసికోల్లాసం : మోదీ 

అస్ఫూర్తిదాయక కథలతో మానసికోల్లాసం ఏర్పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి నెలా నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మన దేశంలో కథలకు ఉన్నప్రాముఖ్యాన్ని వివరించారు. ఇండియాలో

Updated : 27 Sep 2020 17:33 IST

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని 

న్యూదిల్లీ : స్ఫూర్తిదాయక కథలతో మానసికోల్లాసం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి నెలా నిర్వహించే మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మన దేశంలో కథలకు ఉన్న ప్రాముఖ్యాన్ని వివరించారు. ఇండియాలో కథల ద్వారా జ్ఞానాన్ని పొందే సంస్కృతి ప్రాచీన కాలం నుంచి ఉందని చెప్పిన మోదీ ఇటీవల ఆ ఒరవడి తిరిగి ప్రారంభం అయిందన్నారు. వచ్చే ఏడాదికి భారతావని స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత్‌లో బ్రిటీష్‌ పాలనా కాలం నాటి భారతీయుల స్ఫూర్తిదాయక కథలపై మోదీ చర్చించారు. కథలు చెప్పేవారు ఇటువంటి కథలను వారి జాబితాలో చేర్చుకొని కొత్త తరాలకు వాటిని అందించాలని ఆయన కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన మోదీ కథలపై మక్కువ పెంచుకోవటం అవసరమన్నారు. 

ప్రతి కుటుంబం కథలకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించి వాటిని సాధారణ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధాని సూచించారు. వారంలో కొంత సమయాన్ని కథలు వినటానికి, చెప్పటానికి కేటాయించుకోవాలని కోరారు. నీతి, ప్రేమానురాగాలు, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత తదితర అంశాలు ఉన్న కథలు వినటానికి, చెప్పటానికి ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ కృషి చేయాలని  ప్రధాని మోదీ అన్నారు. ఇలా చేయటం వల్ల ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్థిల్లుతుందని ఆయన వివరించారు. కుటుంబంలో తాతలు, అవ్వలు ఉంటే వాళ్ల చిన్నకాలం నాటి కథలను నేటి తరం చెప్పించుకొని వాటిని రికార్డు చేసుకోవాలని సూచించారు. అవి చాలా విధాలుగా ఉపయోగపడతాయని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన స్టోరీ టెల్లింగ్‌ సొసైటీ సభ్యులతో మోదీ మాట్లాడారు. కథలు చెప్పే విధానం, కథలు ఎంచుకునే సమయంలో ఎటువంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని