ఇది అందమైన పాల దుకాణం!

ఎక్కడైనా పర్యటక ప్రాంతాలంటే ప్రాచీన భవనాలు, వినూత్న పార్కులు, సరస్సులు, ఆలయాలు వంటివి ఉంటాయి. కానీ జర్మనీలో పాలు, పాల ఉత్పత్తులు విక్రయించే ఓ దుకాణం సందర్శక ప్రదేశంగా మారిపోయింది. కరోనా కారణంగా ఇప్పుడు పర్యటనలు

Updated : 28 Aug 2020 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్కడైనా పర్యటక ప్రాంతాలంటే ప్రాచీన భవనాలు, వినూత్న పార్కులు, సరస్సులు, ఆలయాలు వంటివి ఉంటాయి. కానీ, జర్మనీలో పాలు, పాల ఉత్పత్తులు విక్రయించే ఓ దుకాణం సందర్శక ప్రదేశంగా మారిపోయింది. కరోనా కారణంగా ఇప్పుడు పర్యటనలు లేవు గానీ.. ఈ దుకాణాన్ని ఏటా ఐదు లక్షల మంది సందర్శిస్తారట. అంతలా ఆ పాల దుకాణంలో ఏం ప్రత్యేకత ఉంది.. అనుకుంటున్నారా? 

డ్రెస్‌డెన్‌లోని బట్జ్‌నర్‌లో 79వ వీధిలో ఫండ్స్‌ మోక్‌రెయి అనే పాల దుకాణం ఉంది. పేరుకు దుకాణమే అయినా అదో ప్యాలెస్‌. లోపలికి అడుగుపెడితే రాజుల కాలం నాటి ప్యాలెస్‌లో అడుగుపెట్టామా అన్న అనుభూతి కలుగుతుందట. గోడలపై అందమైన కళాకృతులు, పెయింటింగ్స్‌, ఫ్లోర్‌పై సిరామిక్‌ డిజైన్‌ టైల్స్‌, అద్భుతమైన ఇంటీరియర్‌ డిజైన్‌ సందర్శుకులను ఆశ్చర్యపరుస్తాయి. అందుకే ఈ దుకాణం ‘ప్రపంచంలోనే అందమైన డెయిరీ దుకాణం’గా గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌లోకి ఎక్కింది. ఇంత ప్రఖ్యాతిగాంచిన ఈ పాల దుకాణానికి ఘన చరిత్రే ఉంది. 

రెయిన్‌హోల్డ్‌షెయిన్‌కి చెందిన పాడి రైతు పాల్‌ ఫండ్‌ 1879లో ఆరు ఆవులను వెంట పెట్టుకొని డ్రెస్‌డెన్‌కు వలసవచ్చాడట. అక్కడే రోడ్డు పక్కన ఆవుల నుంచి పాలు సేకరించి అమ్మేవాడట. ఆ తర్వాత అతడి సోదరుడు ఈ వ్యాపారంలో భాగస్వామి కావడంతో డ్రెస్‌డ్నర్‌ గిబ్రుడర్‌ ఫండ్‌ డెయిరీ ప్రారంభించారు. వ్యాపార నిర్వహణ కోసం ఈ ప్యాలెస్‌ను 1891లో నిర్మించారు. జర్మనీలోనే పురాతన సెరామిక్‌ కంపెనీతో రాజరీకం ఉట్టిపడే విధంగా ఇంటిరీయర్‌ డిజైనింగ్‌ చేయించారు. పాల్‌ సోదరుడు మృతి చెందిన తర్వాత అతని‌ కుమారులు ఈ పాల వ్యాపారంలో అడుగుపెట్టారు. వారు దీనిని ఓ బ్రాండ్‌గా మార్చేశారు. మొదట్లో ఒక రోజులో కేవలం 150 లీటర్ల పాలు మాత్రమే అమ్ముడుపోయేవి.. 1930 నాటికి 60వేల లీటర్ల పాలు అమ్మే స్థాయికి చేరుకున్నారు. అమ్ముడుపోగా మిగిలిన పాలతో సొంతగా సబ్బులు తయారు చేయించి విక్రయించేవారు. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ‘ఫండ్స్‌ మోక్‌రెయి’గా పిలుస్తున్నారు.

బాంబుల దాడి నుంచి తప్పించుకుంది

రెండు ప్రపంచయుద్ధాల సమయంలోనూ ఈ పాల దుకాణం విజయవంతంగా కొనసాగింది. బాంబుల దాడి జరిగినా అదృష్టవశాత్తు ఈ దుకాణం ధ్వంసం కాలేదు. అయితే 1978లో కొన్ని కారణాల వల్ల దుకాణం మూతపడింది. తిరిగి 1995లో తెరుచుకుంది. అప్పటి నుంచి పాల కన్నా.. పాల ఉత్పత్తులను ఎక్కువగా విక్రయించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే విదేశీ పర్యటకులు ఈ ప్యాలెస్‌ను చూసేందుకు వస్తుండటంతో డ్రెస్‌డెన్‌లో ఇదో పర్యటక ప్రాంతంగా మారింది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని