పుదీనా తాగేద్దామా!

పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి కేవలం దీన్ని కూరల్లో వినియోగించడమే కాదు... ఈ పానీయాలు తయారుచేసుకుని తాగిచూడండి.

Updated : 19 Aug 2021 21:02 IST

పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మరి కేవలం దీన్ని కూరల్లో వినియోగించడమే కాదు... ఈ పానీయాలు తయారుచేసుకుని తాగిచూడండి.

డీటాక్స్‌ వాటర్‌: శరీరంలో ఆహార వ్యర్థాలు, మందుల తాలూకు రసాయనాలు టాక్సిన్లుగా ఉండిపోతాయి. అప్పుడప్పుడూ అయినా శరీరానికి డీటాక్సిఫికేషన్‌ అవసరం. అందుకోసం పుదీనా నీళ్లు చక్కగా పనిచేస్తాయి. ఓ గాజు సీసాలో కొన్ని పుదీనా ఆకులు, చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలూ వేసి నీళ్లు పోయండి. గంట తరువాత ఆ నీటిని కొద్దికొద్దిగా తాగి చూడండి. అలసట ఎగిరిపోతుంది. శరీరం తేలికపడుతుంది.

 

 

టీ: వేడి వేడి ఛాయ్‌ లేదా గ్రీన్‌ టీ ఒక్కోసారి బ్లాక్‌ టీ... ఇలా రకరకాలుగా తాగుతూ ఉంటాం. వీటికి బదులు ఈసారి మింట్‌ టీ ప్రయత్నించి చూడండి. ఇది మీకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్నిస్తుంది. ఈ సువాసన మెదడుని తేలికపరుస్తుంది. ఇందుకోసం నీళ్లల్లో కొన్ని పుదీనా ఆకులను వేసి మరగనివ్వాలి. దానికి అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగితే సరిపోతుంది. 

 

సూప్‌.. మీరు చేసే ఏ సూప్‌లోనైనా చివరగా గుప్పెడు పుదీనా ఆకులను వేసి మరిగించండి. అప్పుడు దాని రుచి అంతకంతకూ పెరిగిపోతుంది. ఆరోగ్యంతోపాటు మీ జిహ్వకు చక్కటి రుచి దొరుకుతుంది. ఇది జలుబు, దగ్గు...శ్వాస కోస సమస్యల్ని అదుపు చేస్తుంది. 

 

లస్సీ.. కప్పు పెరుగులో గుప్పెడు పుదీనా ఆకులు, చిటికెడు నల్ల ఉప్పు, పావు చెంచా చొప్పున చక్కెర, జీలకర్ర వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన లస్సీ రెడీ! దీన్ని తాగడం వల్ల అతిదాహం అదుపులో ఉంటుంది. వేడి తగ్గుతుంది. 

 

చట్నీ.. తాజా పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి గ్రైండ్‌లో ఓ తిప్పు తిప్పండి. తగినంత ఉప్పు చేరిస్తే.. రుచికరమైన పుదీనా చట్నీ రెడీ.దీన్ని తింటే ఆకలి పెరుగుతుంది. శాండ్‌విచ్, స్నాక్స్‌లో పెట్టి ఇస్తే చిన్నారులూ ఇష్టంగా తింటారు. ఫలితంగా నోటి దుర్వాసన అదుపులో ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని